-

‘హోరాహోరీ’ ఆరంభం

1 Feb, 2016 00:28 IST|Sakshi
‘హోరాహోరీ’ ఆరంభం

ఉత్కంఠ పోరులో ఓడిన తెలుగు టైటాన్స్
సాక్షి, విశాఖపట్నం: ప్రొ కబడ్డీ లీగ్ మూడో సీజన్‌కు ఘనమైన ఆరంభం లభించింది. నరాలు తెగే ఉత్కంఠతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్ పోరాడి ఓడింది. రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన లీగ్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబా 27-25తో తెలుగు టైటాన్స్‌పై విజయం సాధించింది.

ఆరంభంలో ఇరు జట్లు ప్రతి పాయింట్ కోసం హోరాహోరీ తలపడ్డాయి. అయితే ముంబా జట్టు తొలి అర్ధభాగంలో 12-8తో ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధం ఆరంభంలో ముంబా జోరు పెంచడంతో ఆ జట్టు ఒక దశలో 22-10 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో  సుఖేశ్ హెగ్డే చకచకా పాయింట్లు తేవడం, రాహుల్ చౌదరి కూడా స్థాయికి తగ్గట్లుగా ఆడటంతో... చివరి క్షణాల్లో తెలుగు జట్టు ముంబాకు చేరువయింది.

27-24 ఆధిక్యంలో ఉన్న దశలో ముంబా జట్టు కొంత సమయం వృథా చేయడంతో పాటు పాయింట్లు ఇవ్వకుండా తెలివిగా ఆడి మ్యాచ్ చేజారకుండా చూసుకుంది. సుఖేశ్ హెగ్డే 9 పాయింట్లు సాధించగా... రాహుల్ 6 పాయింట్లు తెచ్చాడు. డిఫెన్స్‌లో రాణించిన ధర్మరాజ్ 4 పాయింట్లు సాధించాడు. ముంబై తరఫున  కెప్టెన్ అనూప్ 6 పాయింట్లు సాధించాడు. రిశాంక్ 7 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 35-29తో దబాంగ్ ఢిల్లీపై నెగ్గింది.

మ్యాచ్ ఆరంభానికి ముందు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్‌ఖాన్ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వచ్చి మ్యాచ్ మొత్తం వీక్షించారు. మధ్యలో సరదాగా తొడగొట్టారు. తెలుగు టైటాన్స్ బ్రాండ్ అంబాసిడర్ దగ్గుబాటి రానా సందడి చేయగా... మ్యాచ్ ఆరంభానికి ముందు ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్రదర్శన ఆకట్టుకుంది.

మరిన్ని వార్తలు