బెంగళూర్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం

9 May, 2014 23:51 IST|Sakshi
బెంగళూర్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం

బెంగళూర్: ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ విసిరిన199 భారీ పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూర్ ఆదిలోనే కీలక వికెట్లు చేజార్చుకుంది.  ఓపెనర్ క్రిస్ గేల్(4), విరాట్ (0) కే పెవిలియన్ చేరడంతో బెంగళూర్ కష్టాలను కొనితెచ్చుకుంది. కేవలం 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన బెంగళూర్ ఇక తేరుకోలేకపోయింది. బెంగళూర్ ఆటగాళ్లలో ఒక్క డివిలియర్స్ (53) పరుగుల మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోవడంతో బెంగళూర్ కు ఓటమి తప్పలేదు. చివర్లో స్టార్క్ (29) పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ కు మూడు వికెట్లు లభించగా, బాలాజీ, శివం శర్మలకు తలో రెండు వికెట్లు దక్కాయి.

 

అంతకముందు టాస్ గెలిచిన బెంగళూర్ తొలుత పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (30), మన్ దీప్ సింగ్(29) పరుగులు చేసి పంజాబ్ కు చక్కటి ఆరంభాన్నిచ్చారు. అనంతరం మ్యాక్స్ వెల్  (25;2 సిక్స్ల్ లు, 2 ఫోర్లు)తో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు.

తరువాత మరో హిట్టర్ మిల్లర్ బెంగళూర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 29 బంతులు ఎదుర్కొన్న మిల్లర్ (66;3 సిక్స్ లు, 8 ఫోర్లు)తో పంజాబ్ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.చివర్లో సాహా(17), మిచెల్ జాన్సన్ (16) పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. బెంగళూర్ బౌలర్లలో స్టార్క్, హర్సాల్ పటేల్, చాహాల్ కు తలో రెండు వికెట్లు లభించాయి.

మరిన్ని వార్తలు