సింధు, శ్రీకాంత్‌లపై దృష్టి 

26 Mar, 2019 01:15 IST|Sakshi

నేటి నుంచి ఇండియా ఓపెన్‌ టోర్నీ 

న్యూఢిల్లీ: కొత్త సీజన్‌లో తొలి టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో... భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ ఇండియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌ బరిలోకి దిగుతున్నారు. అనారోగ్యం కారణంగా భారత మరో స్టార్‌ సైనా నెహ్వాల్‌... టాప్‌ సీడ్‌ పొందిన ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌ చెన్‌ యుఫె (చైనా) వైదొలగడం... జపాన్‌ క్రీడాకారిణులు కూడా ఈ టోర్నీకి దూరంగా ఉండటంతో మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ సింధు ఫేవరెట్‌గా మారింది. ఈ ఏడాది సింధు ఇండోనేసియా మాస్టర్స్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరగా... ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. అయితే ఇండియా ఓపెన్‌లో సింధుకు మంచి రికార్డు ఉంది. 2017లో టైటిల్‌ నెగ్గిన ఆమె, గతేడాది రన్నరప్‌గా నిలిచింది. బుధవారం జరిగే తొలి రౌండ్‌లో భారత్‌కే చెందిన ముగ్ధా ఆగ్రేతో సింధు ఆడుతుంది. అంతా సవ్యంగా సాగితే సెమీస్‌లో సింధుకు మూడో సీడ్‌ హీ బింగ్‌జియావో (చైనా) ఎదురయ్యే అవకాశముంది. మరో పార్శ్వం నుంచి ప్రపంచ మాజీ చాంపియన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌), ఏడో సీడ్‌ హాన్‌ హుయె (చైనా) సెమీస్‌ చేరుకోవచ్చు. సింధుతోపాటు మెయిన్‌ ‘డ్రా’లో తెలుగు అమ్మాయిలు గుమ్మడి వృశాలి, చుక్కా సాయిఉత్తేజిత రావు పోటీపడుతున్నారు.  మంగళవారం క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం నుంచి మెయిన్‌ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి.  

మరోవైపు ఏడాదిన్నరగా ఒక్క టైటిల్‌ లేకుండా ఉన్న భారత స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ సొంతగడ్డపై ఆ లోటు తీర్చుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. బుధవారం జరిగే తొలి రౌండ్‌లో వోంగ్‌ వింగ్‌ కి విన్సెంట్‌ (హాంకాంగ్‌)తో శ్రీకాంత్‌ ఆడనున్నాడు. శ్రీకాంత్‌తోపాటు భారత్‌ నుంచి సాయిప్రణీత్, సమీర్‌ వర్మ, ప్రణయ్, అజయ్‌ జయరామ్, గురుసాయిదత్, పారుపల్లి కశ్యప్, శుభాంకర్‌ డే బరిలో ఉన్నారు.  

మరిన్ని వార్తలు