సింధు వైఫల్యంపై గోపీచంద్‌ వ్యాఖ్య

21 Nov, 2019 10:03 IST|Sakshi

కోల్‌కతా: తీరికలేని షెడ్యూల్, ఎడతెరిపి లేని ప్రయాణాల కారణంగానే సింధు ఆట మళ్లీ గాడి తప్పిందని భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అభిప్రాయపడ్డారు. ఆగస్టులో ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలిచాక ఫ్రెంచ్‌ ఓపెన్‌ మినహా మిగతా టోరీ్నల్లో ఆరంభ రౌండ్లలోనే విఫలమవుతోన్న ఆమెపై కోచ్‌ నమ్మకం ఉంచారు. గత రెండు నెలల్లో సింధు అనుకూల ఫలితాలు సాధించలేదన్న ఆయన... త్వరలోనే ఆమె గెలుపు బాట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

‘వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ తర్వాత సింధుకు తీరికలేని షెడ్యూల్‌ ఎదురైంది. చైనా, కొరియా, డెన్మార్క్, హాంకాం గ్‌ ఇలా ప్రతి టోర్నీ కోసం సుదూర ప్రయాణాలు చేసింది. ఇదంతా ఆమె ఆటపై ప్రభావం చూపింది. తీరిక లేని షెడ్యూల్‌ కారణంగానే ఆమె విఫలమవుతోంది. గత రెండు నెలలుగా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. తనే కాదు మరికొంత మంది ప్రపంచ స్థాయి ప్లేయర్లు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.  కానీ త్వరలోనే సింధు మళ్లీ విజయాల బాట పడుతుంది’ అని గోపీ వివరించారు.

రానున్న టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు పతకం గెలిచే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య శుక్రవారం డేనైట్‌ టెస్టు ప్రారంభంకానున్న నేపథ్యంలో తొలి రోజు ప్రముఖ క్రీడాకారులను బీసీసీఐ సత్కరించనుంది. ఈ జాబితాలో గోపీచంద్, పీవీ సింధు కూడా ఉన్నారు. 

మరిన్ని వార్తలు