'అందుకు రవిశాస్త్రినే కారణం'

1 Jan, 2018 11:27 IST|Sakshi

కేప్‌టౌన్‌: ఇటీవల కాలంలో భారత క్రికెట్‌ జట్టు దూకుడైన ప్రదర్శనతో వరుస విజయాల్ని సాధిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా 2017లో టీమిండియా అన్ని ఫార్మాట్లలో కలిపి 53 మ్యాచ్‌లు ఆడితే 37 విజయాల్ని సొంతం చేసుకుంది. ఇది 2016 విజయాల శాతం కంటే దాదాపు రెండు శాతం అధికం. 2016లో 67.4 శాతం విజయాల్ని టీమిండియా నమోదు చేస్తే.. గడిచిన ఏడాది 69.8 శాతంతో విజయాల్ని సొంతం చేసుకుంది.


ఈ తరహాలో టీమిండియా విజయాలు సాధించడానికి ప్రధాన కోచ్‌ రవిశాస్త్రినే కారణమంటున్నాడు బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌. రవిశాస్త్రి పర్యవేక్షణ బాధ్యత చేపట్టిన తరువాత భారత క్రికెట్‌ జట్టులో మార్పు స్పష్టంగా కనబడుతోంది.  బ్యాట్స్‌మన్‌ మైండ్‌సెట్‌ను రవిశాస్త్రి క్రమంగా మారుస్తున్నాడు. దూకుడైన ఆటను అలవాటు చేస్తూ వారిలో ఉన్న భయాన్ని, ఆందోళనను పోగొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ జట్టును ముందుకు తీసుకెళుతున్నాడు. భారత జట్టు తెగింపుతో క‍్రికెట్‌ ఆడుతూ విజయాలు సాధిస్తుందంటే అందుకు కారణం రవిశాస్త్రినే.  రిస్క్‌ చేయడానికి ఆటగాళ్లకు రవిశాస్త్రి స్వేచ్ఛనిస్తున్నాడు. దాంతో క్రికెటర్లు ఆత్మరక్షణ ధోరణిని వీడి.. జట్టులో ఎలాంటి బాధ్యతలనైనా స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ తాము విఫలమైనా.. తమకి అండగా ఒకరున్నారనే భావనతో ఆటగాళ్లు ఎటువంటి ఒడిదుడుకు లేకుండా ఆడుతున్నారు' అని సంజయ్‌ బంగర్‌ విశ్లేషించాడు.గతేడాది మధ్యలో టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి బాధ్యతలు స్వీకరించాడు. అనిల్‌ కుంబ్లే స్థానంలో రవిశాస్త్రిని కోచ్‌గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
 

మరిన్ని వార్తలు