రిషభ్‌ పంత్‌ సరికొత్త రికార్డు

10 Dec, 2018 11:52 IST|Sakshi

అడిలైడ్‌: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత వికెట్‌ కీపర్‌గా అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఆసీస్‌తో ఇక్కడ జరిగిన తొలి టెస్టులో రిషభ్‌ ఈ ఫీట్‌ సాధించాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో రిషభ్‌ పట్టిన క్యాచ్‌లు 11. ఫలితంగా టీమిండియా తరుఫున ఇప్పటివరకూ వృద్ధిమాన్‌ సాహా పేరిట ఉన్న రికార్డును రిషభ్‌ బ్రేక్‌ చేశాడు. ఆసీస్‌తో తొలి ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లు పట్టిన రిషభ్‌.. రెండో ఇన‍్నింగ్స్‌లో 5 క్యాచ్‌లు అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లు పట్టడం  ద్వారా ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత వికెట్‌ కీపర్లలో ధోనితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన రిషభ్‌.. ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న భారత వికెట్‌ కీపర్‌గా నిలవడం మరో విశేషం.

ఇదిలా ఉంచితే, ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్‌ కీపర్ల జాబితాలో జాక్‌ రస్సెల్‌(ఇంగ్లండ్‌), ఏబీ డివిలియర్స్‌(దక్షిణాఫ్రికా)ల సరసన రిషభ్‌ నిలిచాడు. ఆసీస్‌తో మ్యాచ్‌లో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో స్టార్క్‌ క్యాచ్‌ను పట్టిన తర్వాత రిషభ్‌ ఈ ఘనతను సాధించాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో పది క్యాచ్‌లు పట్టిన జాబితాలో బాబ్‌ టేలర్‌(ఇంగ్లండ్‌), ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌(ఆస్ట్రేలియా), వృద్ధిమాన్‌ సాహా( భారత్‌)లు ఉన్నారు.

రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 291 పరుగులకు ఆలౌట్‌ కావడంతో భారత్‌ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది ఆసీస్‌ గడ్డపై భారత్‌కు దాదాపు 11 ఏళ్ల తర్వాత తొలి విజయం. చివరిసారి 2008 సీజన్‌లో భారత్‌ చివరిసారి ఆస్ట్రేలియాలో విజయం సాధించింది. కాగా, ఆసీస్‌  గడ్డపై ఆరంభపు టెస్టులో విజయం సాధించడం భారత్‌కు ఇదే తొలిసారి. ఆ జట్టుతో ఆడిన 45 టెస్టుల్లో భారత్‌కు ఇది ఆరో విజయం మాత్రమే. గత రెండు పర్యటనల్లోనూ ఒక్క టెస్టు కూడా భారత్‌ గెలవలేదు.

మరిన్ని వార్తలు