హెచ్‌సీఏలో గొడవ ముదిరింది!

16 Jul, 2018 04:36 IST|Sakshi
శేష్‌ నారాయణ్, వివేక్‌ (ఫైల్‌)

కేఎస్‌సీఏ టోర్నీకి రెండు వేర్వేరు జట్లను ప్రకటించిన కార్యదర్శి, అపెక్స్‌ కౌన్సిల్‌

క్రికెటర్ల కెరీర్‌తో చెలగాటం

సాక్షి, హైదరాబాద్‌:  హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) కార్యదర్శి శేష్‌ నారాయణ్, జి.వివేకానంద్‌ నేతృత్వంలోని అపెక్స్‌ కౌన్సిల్‌ మధ్య గత కొంత కాలంగా సాగుతున్న విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. ఇప్పటి వరకు అవినీతి, నిధుల గోల్‌మాల్‌వంటి అంశాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగించిన ఇరు వర్గాలు ఇప్పుడు జట్టు ఎంపిక విషయంలో కూడా తమ అహాన్ని బయట పెట్టాయి. ఈ నెల 18 నుంచి ఆగస్టు 15 వరకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ సంఘం (కేఎస్‌సీఏ) ఒక టోర్నీ నిర్వహిస్తోంది.

2018–19 రంజీ సీజన్‌ సన్నాçహాల్లో భాగంగా జరిగే ఈ టోర్నీలో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా హైదరాబాద్‌ జట్టు బరిలోకి దిగుతోంది. అయితే ఇందులో పాల్గొనే ఆటగాళ్లపై సందిగ్ధత నెలకొంది. అటు కార్యదర్శి, ఇటు అపెక్స్‌ కౌన్సిల్‌ రెండు వేర్వేరు జట్లను ప్రకటించాయి. మాదంటే మాదే అధికారిక జట్టని ఇరు వర్గాలు చెబుతున్నాయి. శివాజీ యాదవ్, రమేశ్, నిరంజన్, ఎంపీ అర్జున్, సయ్యద్‌ మిరాజ్‌లతో కూడా సెలక్షన్‌ కమిటీ ఆదివారం అపెక్స్‌ కౌన్సిల్‌ జట్టును ప్రకటించింది. ఈ కమిటీని కూడా శనివారమే ఏర్పాటు చేశారు.

త్వరలో జరుగబోయే ఏజీఎంలో ఈ కమిటీ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేస్తామని కౌన్సిల్‌ స్పష్టం చేసింది. అయితే నిబంధనల ప్రకారం కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు పాత కమిటీనే కొనసాగుతుంది కాబట్టి పాత సెలక్షన్‌ కమిటీతోనే జట్టును ఎంపిక చేసినట్లు శేష్‌ నారాయణ్‌ చెబుతున్నారు. ఈ సెలక్షన్‌ కమిటీలో అరవింద్‌ శెట్టి, నిరంజన్, విష్ణువర్ధన్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ తరహాలో జట్ల ఎంపిక క్రికెటర్లను ఆందోళనలో పడేసింది. తాము జట్టులోకి ఎంపికైనట్లా, కానట్లా... అసలు టోర్నీకి వెళ్లాల్సి ఉందా లేదా అని వారంతా సంకోచంలో ఉన్నారు. చివరకు ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఆసక్తికరం.  

హైదరాబాద్‌ జట్లు
కార్యదర్శి ప్రకటించిన హైదరాబాద్‌ జట్టు: సీవీ మిలింద్‌ (కెప్టెన్‌), రోహిత్‌ రాయుడు, అభిరత్‌ రెడ్డి,  ఠాకూర్‌ తిలక్‌ వర్మ, హిమాలయ్‌ అగర్వాల్‌ (వికెట్‌ కీపర్‌), చందన్‌ సహాని, యతిన్‌ రెడ్డి, టి. రవితేజ, సాకేత్‌ సాయిరామ్, టీపీ అనిరుధ్, తనయ్‌ త్యాగరాజన్, ముదస్సిర్‌ హుస్సేన్, కె. సుమంత్‌ (వికెట్‌ కీపర్‌), సమిత్‌ రెడ్డి, మల్లికార్జున్, అలంకృత్‌ అగర్వాల్, ఎన్‌. అర్జున్‌ యాదవ్‌ (కోచ్‌), నోయెల్‌ డేవిడ్‌ (ఫీల్డింగ్‌ కోచ్‌), మహబూబ్‌ అహ్మద్‌ (మేనేజర్‌), భీషం ప్రతాప్‌ సింగ్‌ (ఫిజియో), నవీన్‌ రెడ్డి (ట్రెయినర్‌).

అపెక్స్‌ కౌన్సిల్‌ ప్రకటించిన హైదరాబాద్‌ జట్టు: అంబటి రాయుడు (కెప్టెన్‌), పి. అక్షత్‌ రెడ్డి (వైస్‌ కెప్టెన్‌), తన్మయ్‌ అగర్వాల్, రోహిత్‌ రాయుడు, బి. సందీప్, కొల్లా సుమంత్‌ (వికెట్‌ కీపర్‌), టి. రవితేజ, ఆకాశ్‌ భండారి, మెహదీహసన్, ప్రజ్ఞాన్‌ ఓజా, ఎం. రవికిరణ్, ముదస్సర్‌ హుస్సేన్, సీవీ మిలింద్, ఎ. వరుణ్‌ గౌడ్, చందన్‌ సహాని, ఠాకూర్‌ తిలక్‌ వర్మ, ఎన్‌పీ సింగ్‌ (కోచ్‌), ఇంద్ర శేఖర్‌ రెడ్డి (మేనేజర్‌), ప్రతాప్‌ సింగ్‌ (ఫిజియో), నవీన్‌ రెడ్డి (ట్రెయినర్‌).  

మరిన్ని వార్తలు