రోహిత్‌ శర్మ అవుట్‌

4 Feb, 2020 01:00 IST|Sakshi

గాయం కారణంగా కివీస్‌తో వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరం

టెస్టుల్లో గిల్, వన్డేల్లో మయాంక్‌కు చోటు!

ముంబై: న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌ను 5–0తో క్లీన్‌స్వీప్‌ చేసిన ఉత్సాహంలో ఉన్న భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. కాలి పిక్క గాయం కారణంగా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మిగిలిన పర్యటన నుంచి తప్పుకున్నాడు. బుధవారం నుంచి జరిగే వన్డే సిరీస్‌తో పాటు ఆ తర్వాత జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు కూడా రోహిత్‌ దూరమయ్యాడు. మౌంట్‌ మాంగనీలో ఆదివారం జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో 60 పరుగులు చేసిన అనంతరం కాలి పిక్క గాయంతో అతను రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.

ఆ తర్వాత పరీక్షల్లో దాని తీవ్రత ఎక్కువని తేలింది. ‘రోహిత్‌ గాయం చిన్నదేమీ కాదు. ఫిజియో దీనిని పర్యవేక్షిస్తున్నాడు. అయితే న్యూజిలాండ్‌తో మిగిలిన సిరీస్‌లో మాత్రం ఆడే అవకాశం లేదని తేలిపోయింది. అతను ఈ పర్యటన నుంచి తప్పుకుంటున్నాడు’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఓపెనర్‌గా భారత జట్టుకు తిరుగులేని విజయాలు అందిస్తున్న రోహిత్‌ శర్మ లేకపోవడం వన్డేల్లో టీమిండియాను బలహీనం చేస్తుందనడంలో సందేహం లేదు. గత ఏడాది టెస్టుల్లో కూడా ఓపెనర్‌గా బరిలోకి దిగిన తర్వాత రోహిత్‌ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. విశాఖపట్నంలో తొలి టెస్టులోనే రెండు సెంచరీలు చేసిన అతను ఆ తర్వాత రాంచీలో డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. ఇప్పుడు విదేశీ గడ్డపై సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న తరుణంలో గాయం అతని జోరుకు బ్రేక్‌ వేసింది.

పృథ్వీ షాకు నో! 
రోహిత్‌ శర్మ స్థానంలో న్యూజిలాండ్‌లోనే భారత ‘ఎ’ జట్టు తరఫున ఆడుతున్న శుబ్‌మన్‌ గిల్, మయాంక్‌ అగర్వాల్‌లకు టెస్టు, వన్డే జట్లలో స్థానం లభించనున్నట్లు సమాచారం. అయితే బీసీసీఐ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. తొలి అనధికారిక టెస్టులో డబుల్‌ సెంచరీ చేయడం గిల్‌ స్థానాన్ని అవకాశాలను పటిష్టం చేయగా... విండీస్‌ వన్డే సిరీస్‌కు జట్టులో భాగంగా ఉన్న మయాంక్‌కు ఇప్పుడు మరో అవకాశం లభించింది. రాహుల్‌ కూడా అందుబాటులో ఉన్న కారణంగా... ప్రస్తుతం వన్డే జట్టులోకి ఎంపికైన పృథ్వీ షాను ఇంకా టెస్టుల్లోకి పరిశీలించలేదని తెలుస్తోంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా