సైబర్‌ రక్షణ

4 Feb, 2020 00:57 IST|Sakshi

 దేశంలోనే తొలి సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ రాష్ట్రంలో ఏర్పాటు

ప్రభుత్వ విభాగాలు, ఐటీ, విద్య, పరిశోధన సంస్థలకు శిక్షణ

సైబర్‌ సెక్యూరిటీలో ఇజ్రాయెల్‌ స్థాయికి చేరడమే సీసీఓఈ లక్ష్యం

డేటా భద్రత, గోప్యతపై ఆందోళన నేపథ్యంలో పీడీపీ బిల్లు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్నెట్‌ సేవలను అత్యధికంగా వినియో గిస్తున్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌ తరచూ సైబర్‌ దాడులకు గురవుతోంది. దేశ రక్షణ, ఆర్థిక సంస్థలతోపాటు ఇతర కీలక రంగాలకు చెందిన డేటా (సమాచారం) తస్కరణ, దుర్వినియోగమవుతోంది. దీంతో దేశ భద్రతతో పాటు ఆర్థిక పురోగతిపై తీవ్ర ప్రభావం చూపు తోంది. సైబర్‌ సెక్యూరిటీ ప్రమాదంలో ఉన్నప్పటికీ చాలా రాష్ట్రాలు సైబర్‌ సెక్యూరిటీ సెల్స్, సైబర్‌ ఆపరేషన్‌ సెంటర్ల ఏర్పాటు వంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మరోవైపు ఇన్ఫర్మేషన్‌ టెక్నా లజీ రంగంలో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) వంటి నూతన సాంకేతికత వినియోగం పెరగ డంతోపాటు త్వరలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా అందుబాటులో వచ్చే ఐటీ సాంకేతికతలతో సైబర్‌ భద్రతకు మరింత ముప్పు పొంచి ఉందని నిపుణులు ఆందోళన చెందుతు న్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైబర్‌ సెక్యూరిటీ దిశగా చర్యలు చేపడుతున్నాయి. సైబర్‌ సెక్యూరిటీ విషయంలో ఇతర రాష్ట్రాలకంటే ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇటీవల హైదరాబాద్‌లో సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీసీఓఈ) ప్రారంభించింది.

దేశంలోనే మొట్టమొదటి సీసీఓఈ...
సైబర్‌ సెక్యూరిటీకి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని దేశంలోనే మొట్టమొదటి సైబర్‌ సెక్యూ రిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీసీఓఈ)ను డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (డీఎస్‌సీఐ) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సైబర్‌ సెక్యూరిటీ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉండే సీసీఓఈ... సైబర్‌ సెక్యూరిటీ, గోప్యతకు సంబంధించిన అనువైన వాతావరణాన్ని సృష్టించడంపై దృష్టి కేంద్రీకరిస్తుంది. సీసీఓఈలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం ద్వారా ప్రభుత్వ విభాగాలు, ఐటీ సంస్థలు, విద్య, పరిశోధన కేంద్రాలతోపాటు సంబంధిత రంగానికి చెందిన వారికి సైబర్‌ సెక్యూరిటీపై అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న ఇజ్రాయెల్‌ స్థాయికి రాష్ట్రాన్ని చేర్చేందుకు ఈ సెంటర్‌ ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. సైబర్‌ సెక్యూరిటీ పరిశోధనల్లో ఇప్పటికే రష్యా, యూకే, నెదర్లాండ్స్, కెనడా వంటి దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్న సీసీఓఈ... దేశీయంగా టీ–హబ్, ఫిక్కీ, సీఐఐ, ఐఐటీ హైదరాబాద్‌ వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సీసీఓఈ ఏర్పాటు ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

డేటా భద్రత కోసం పీడీపీ బిల్లు...
సైబర్‌ సెక్యూరిటీ కోసం ఇప్పటికే నేషనల్‌ టెక్నికల్‌ ఆర్గనైజేషన్‌తోపాటు హోం, ఐటీ, రక్షణ, మానవ వనరుల మంత్రిత్వ శాఖలు వేర్వేరు కార్యకలాపాలు చేపట్టాయి. అయతే డేటా భద్రత, గోప్యతపై ఆందోళన పెరుగుతుండటంతో ‘పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌’బిల్లు తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలనలో ఉన్న ఈ బిల్లు... త్వరలో పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉంది. బిల్లు ప్రతిపాదనల ప్రకారం తొలుత చైర్మన్, నలుగురు శాశ్వత సభ్యులు ఉండే డేటా ప్రొటెక్షన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేస్తారు. ఏది సున్నిత సమాచారం, ఏది కీలక సమాచారం అనే అంశాలను ఈ అథారిటీ నిర్వచించడంతోపాటు దేశంలోనే ఉండాల్సిన డేటా, ఇతర దేశాలకు ఇవ్వాల్సిన డేటాపై స్పష్టత ఇస్తుంది. బిల్లును చట్టంగా మార్చి ఒకట్రెండేళ్లలో అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సైబర్‌ సెక్యూరిటీ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీ రూపొందించాలని నిర్ణయించింది.  

మరిన్ని వార్తలు