చాంపియన్‌ సాయి అచ్యుత్‌

1 Jul, 2019 13:58 IST|Sakshi

రాష్ట్రస్థాయి చెస్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర యూత్‌ అండర్‌–25 ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో సాయి అచ్యుత్‌ చాంపియన్‌గా నిలిచాడు. తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం కార్యాలయంలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 7 రౌండ్ల అనంతరం 6.5 పాయిం ట్లతో సాయి అచ్యుత్‌ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం చివరిదైన ఏడో రౌండ్‌లో అకీరా సౌమ్యనాథ్‌తో జరిగిన మ్యాచ్‌ను సాయి అచ్యుత్‌ డ్రా చేసుకున్నాడు. పవన్‌ తేజ 6 పాయింట్లతో రన్నరప్‌గా నిలవగా... 5.5 పాయింట్లు సాధించిన శిబి శ్రీనివాస్‌ (లిటిల్‌ ఫ్లవర్‌ జూనియర్‌ కాలేజి), అకీరా సౌమ్యనాథ్‌ (తక్షశిల పబ్లిక్‌ స్కూల్‌) వరుసగా మూడు, నాలుగు స్థానాలను సంపాదించుకున్నారు.

వీరంతా తొలి నాలుగు స్థానాల్లో నిలిచి జాతీయ యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. ఇతర ఏడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో ధ్రువపై పవన్‌తేజ, నరేశ్‌పై శ్రేయ, అక్షయ్‌పై శ్రీనందన్, నికుంజ్‌పై హర్షిత అగర్వాల్‌ విజయం సాధించారు. శిబి శ్రీనివాస్‌తో జరిగిన గేమ్‌ను బిపిన్‌రాజ్‌ డ్రాగా ముగించాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం ఉపాధ్యక్షుడు మేజర్‌ శివప్రసాద్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు