గోపీచంద్కు సైనా గుడ్బై!!

2 Sep, 2014 10:56 IST|Sakshi
గోపీచంద్కు సైనా గుడ్బై!!

బ్యాడ్మింటన్లో అత్యంత విజయవంతమైన గురుశిష్యులు.. విడిపోతున్నారు. తన గురువు పుల్లెల గోపీచంద్ శిష్యరికంలో దేశానికి పలు పతకాలు సాధించిపెట్టిన సైనా నెహ్వాల్.. ఇప్పుడు ఆయనను వదిలిపెట్టి వేరే గురువు వద్దకు కోచింగ్ కోసం వెళ్తోంది. 2012 ఒలింపిక్స్లో కాంస్యపతకం సాధించిన సైనానెహ్వాల్కు దాదాపు 20 వరకు అంతర్జాతీయ టైటిళ్లు వచ్చాయి. ఇప్పుడు త్వరలో ఆసియా క్రీడలు జరగనున్న నేపథ్యంలో ఆమె భారతజట్టు మాజీ కోచ్ విమల్ కుమార్ వద్ద బెంగళూరులో కోచింగ్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇటీవల డెన్మార్క్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ సందర్భంగా గోపీచంద్కు ఈ విషయం చెప్పగా.. ఆయన కూడా సరేనన్నట్లు తెలిసింది.

ఇటీవలి కాలంలో సైనా నెహ్వాల్ తన పాత ఫామ్ను కోల్పోవడం, పీవీ సింధు లాంటి క్రీడాకారిణులు ముందంజలోకి రావడంతో గోపీచంద్ విషయంలో ఆమె పునరాలోచన మొదలుపెట్టింది. ప్రపంచ ఛాంపియన్షిప్ నుంచి క్వార్టర్ ఫైనల్స్ దశలోనే వెనుదిరగాల్సి రావడంతో ఇక తన నిర్ణయాన్ని ఆమె స్థిరపరుచుకుంది. తాను బెంగళూరు వెళ్తున్నానని, విమల్ కుమార్ సర్ వద్ద కోచింగ్ తీసుకుంటానని స్పష్టం చేసింది. ఉబెర్ కప్ సమయంలో ఆయనిచ్చని సలహాలు చాలా ఉపయోగపడ్డాయని, అయితే ఆసియా క్రీడలు అయిపోయిన తర్వాత మళ్లీ హైదరాబాద్ వస్తానని సైనా తెలిపింది.

వీళ్లిద్దరూ విడిపోవడం ఇది మొదటిసారి కాదు. 2011లో భాస్కర బాబు వద్ద కోచింగ్ తీసుకోవాలని సైనా భావించింది, కానీ మూడు నెలల తర్వాత మళ్లీ గోపీ వద్దకు వచ్చింది. ఇప్పుడు కేవలం 15 రోజుల శిక్షణ కోసమే బెంగళూరు వెళ్తున్నా.. అది దీర్ఘకాలికం అయ్యే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు.

మరిన్ని వార్తలు