ఆఫ్రిదికి క్షమాపణలు చెప్పిన సల్మాన్!

18 Sep, 2015 17:27 IST|Sakshi
ఆఫ్రిదికి క్షమాపణలు చెప్పిన సల్మాన్!

కరాచీ: గతంలో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఐదేళ్లు నిషేధానికి గురైన పాకిస్థాన్ క్రికెటర్ సల్మాన్ భట్ తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అసలు ఆ సమయంలో ఫిక్సింగ్ అంశానికి దూరంగా ఉండాల్సిందంటూ తన సహచరుడు షాహిద్ ఆఫ్రిది ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. గురువారం సాయంత్రం ఆఫ్రిదిని వ్యక్తిగతంగా కలిసిన సల్మాన్ భట్ తనను క్షమించాల్సిందిగా వేడుకున్నాడు.

 

2010 వ సంవత్సరంలో ఇంగ్గండ్ తో టెస్టు సిరీస్ లో భాగంగా ఫిక్సింగ్ ఆరోపణలు వెలుగు చూశాయి. దీనికి అప్పటి టెస్టు కెప్టెన్ సల్మాన్ భట్ తో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు ఫిక్సింగ్ పాల్పడిట్లు ఆరోపణలు రావడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే సల్మాన్ భట్ పై ఐసీసీ విధించిన ఐదు సంవత్సరాల సస్పెన్షన్ వేటు సెప్టెంబర్ 1 వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో జరిగే దేశవాళీ మ్యాచ్ లకు సల్మాన్ భట్ కు పీసీబీ అనుమతినిచ్చింది. దీనిలో భాగంగా ప్రస్తుత ట్వంటీ 20 కెప్టెన్ ఆఫ్రిదిని సల్మాన్ భట్ కలిశాడు.

 

'కనీసం ఆ సమయంలో నీ సలహా అయిన తీసుకోవాల్సింది. ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా ఫిక్సింగ్ ఉదంతం వెలుగు చూసింది. అందుకు నన్ను క్షమించండి' అంటూ ఆఫ్రిదిని భట్ కోరాడు. దీనిపై ఆఫ్రిది స్పందిస్తూ గతంలో జరిగిపోయిన దాన్ని వదిలి పెట్టి క్రికెట్ పై దృష్టిపెట్టాలని సూచించాడు.

మరిన్ని వార్తలు