జయసూర్యపై రెండేళ్ల నిషేధం

27 Feb, 2019 01:15 IST|Sakshi

విచారణకు సహకరించకపోవడంతో ఐసీసీ చర్య 

దుబాయ్‌: శ్రీలంక విఖ్యాత క్రికెటర్‌ సనత్‌ జయసూర్యపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) రెండేళ్ల నిషేధం విధించింది. నిషేధ సమయంలో అతను ఏ విధమైన క్రికెట్‌ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. క్రికెట్‌ బోర్డులో ఎలాంటి పదవులు చేపట్టకూడదు. 1996లో లంకకు వన్డే ప్రపంచకప్‌ అందించడంలో కీలకపాత్ర పోషించిన ఈ మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించాడు. విచారణలో సహకరించకుండా, సాక్ష్యాల్ని ధ్వంసం చేసినట్లు ఏసీయూ ధ్రువీకరించింది. దీంతో మంగళవారం అతనిపై వేటు వేసింది. ఏదేమైనా అతనిపై గరిష్టంగా ఐదేళ్ల నిషేధం విధించే అవకాశాలున్నప్పటికీ అతని ‘గత చరిత్ర’ బాగుండటంతో రెండేళ్ల నిషేధంతో సరిపెట్టినట్లు ఏసీయూ జనరల్‌ మేనేజర్‌ అలెక్స్‌ మార్షల్‌ వెల్లడించారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలెదుర్కొంటున్న జయసూర్యపై ఐసీసీ 2017లోనే విచారణకు ఆదేశించింది.
 

ఏసీ యూ జనరల్‌ మేనేజర్‌ అలెక్స్‌ ఆధ్వర్యంలోని బృందం అతన్ని పలుమార్లు విచారించింది. 2017లో సెప్టెంబర్‌ 22, 23, ఆక్టోబర్‌ 5 తేదీల్లో జయసూర్యను విచారించాక... ఈ కేసులో ప్రధాన సాక్ష్యం ‘ఫోన్‌–సంభాషణే’ అని ఏసీయూ ప్రాథమికంగా ధ్రువీకరించింది. దీంతో అతని వద్ద ఉన్న రెండు మొబైల్‌ ఫోన్లను ఏసీయూకు సరెండర్‌ చేయాల్సిం దిగా ఆదేశించింది. కానీ లంక మాజీ ఓపెనర్‌ మాత్రం నిరాకరిస్తూ... చివరకు ఆ ఫోన్లను పగులగొట్టాడు. దీంతో ఐసీసీ ప్రవర్తన నియమావళిలోని 2.4.6 ఆర్టికల్‌ ప్రకారం విచారణకు సహకరించకపోవడం, 2.4.7 ప్రకారం సాక్ష్యాల్ని ధ్వంసం చేసినట్లు రుజువు కావడంతో అతనిపై ఐసీసీ శిక్షను ఖరారు చేసింది. రెండేళ్ల నిషేధం గత ఏడాది అక్టోబర్‌ 16 నుంచి అమలవుతుందని ప్రకటించింది. ఆటపట్ల ఉన్న ప్రేమ కారణంగా ఐసీసీ విధించిన నిషేధాన్ని తాను అంగీకరిస్తు న్నట్లు, దీనిపై ఎలాంటి అప్పీల్‌ చేసే ఉద్దేశం లేదని జయసూర్య వివరణ ఇచ్చాడు.  

మరిన్ని వార్తలు