వేణుగానానికి ని'బంధనాలు'!

14 Sep, 2016 00:50 IST|Sakshi
వేణుగానానికి ని'బంధనాలు'!

అతను ఒకప్పుడు భారత్ తరఫున అంతర్జాతీయ వన్డేలు ఆడాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఏకంగా 18 సంవత్సరాల అనుభవం ఉంది. వయసు 34 ఏళ్లు. ఇంకా నాలుగైదేళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉంది. ఆంధ్ర నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరిలో అతనూ ఒకడు. కానీ ఇంత అనుభవం, ఈ ఘనత ఆంధ్ర క్రికెట్ సంఘాని (ఏసీఏ)కి సరిపోవడం లేదు. కుర్రాళ్లకు మార్గనిర్దేశం కోసం అరువు ‘సీనియర్లను’ తెచ్చి ఆడిస్తున్న ఏసీఏ... సుదీర్ఘ అనుభవం ఉన్న సొంత క్రికెటర్‌ను మాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం కొందరు పెద్ద మనుషుల సొంత ఈగోలతో వేణుగోపాలరావును పక్కన పెట్టేశారు.

ఒకప్పుడు రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చిన ఆటగాడిగా కీర్తి తెచ్చుకున్న క్రికెటర్... ఈ రోజు జట్టులో చోటు కోసం పది మందినీ బతిమిలాడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే దిగజారిపోయిన ఆంధ్ర క్రికెట్ ఆటతీరు ఇలాంటి శైలి వల్ల అధఃపాతాళానికి పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
 
* ఆంధ్ర క్రికెట్ సంఘానికి అక్కరకు రాని సొంత ఆటగాడు
* వేణుగోపాలరావును అడ్డుకోవడానికి తెరపైకి కొత్త నిబంధన

సాక్షి, విజయవాడ స్పోర్ట్స్:  ఓ ఆటగాడు నేను ఆడతాను అని ముందుకు వస్తే... నువ్వు ఫామ్‌లో లేవనో లేకపోతే నీకంటే మెరుగైన ఆటగాళ్లు ఉన్నారనో చెబితే... ఆ ఆటగాడు మరింత కష్టపడో, ఇంకా మెరుగ్గా ఆడో జట్టులో స్థానం కోసం పోరాడతాడు. కానీ అనుభవం కోసం బయటి రాష్ట్రాల క్రికెటర్ల వైపు చూసే ఆంధ్ర క్రికెట్ సంఘం... తమ దగ్గరే అత్యంత అనుభవజ్ఞుడు ఉన్నా... జట్టులోకి తీసుకోవడం లేదు. కారణం ఏంటంటే... ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ అనే నిబంధనను చూపిస్తోంది. నిజానికి ఈ నిబంధన దేశంలో ఏ క్రికెట్ సంఘంలోనూ లేదు. ఆంధ్ర క్రికెట్‌లోనూ ఈ ఏడాది కొత్తగా ఈ నిబంధనను  ప్రవేశపెట్టారు. ఇంతకాలం లేనిది ఈసారి వేణుగోపాలరావు తిరిగి ఆంధ్రకు ఆడతానంటుండగానే ఎందుకు ఈ నిబంధన వచ్చింది..?
 
ఆటగాడు దేశవాళీ క్రికెట్‌లో సొంత జట్టు నుంచి నిరభ్యంతరకర పత్రం (ఎన్‌ఓసీ) తీసుకొని మరో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తే పునరాగమనం చేసేందుకు కనీసం మూడేళ్ల వ్యవధి ఉండాలి... క్రికెటర్ల బదిలీలకు సంబంధించి ఉన్న నిబంధన ఇది. ఆంధ్ర క్రికెటర్ వేణుగోపాలరావు గత మూడు సీజన్లు గుజరాత్ తరఫున ఆడాడు. చెప్పుకోదగ్గ ప్రదర్శనతో ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ అతను ఆంధ్రకు తిరిగి రావాలని భావించాడు. అయితే ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ కనీసం ఏడాది ఉండాలంటూ తీసుకొచ్చిన కొత్త నిబంధన ఇప్పుడు అతడి అవకాశాన్ని దెబ్బ తీస్తోంది. బయటి జట్టుకు ఆడిన తర్వాత మళ్లీ సొంత టీమ్‌లోకి వచ్చే ముందు ఒక సీజన్ పాటు మరే జట్టుకూ ఆడకుండా విరామం పాటించాలనేదే ఈ నిబంధన. అరుుతే గతంలో ఎప్పుడూ ఇలా లేదు. దేశంలో ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించినా... ఆడగల సామర్థ్యం, ఆసక్తి ఉంటే విరామంతో పని లేకుండా నేరుగా సొంత జట్టు సెలక్షన్‌‌సకు అర్హత పొందేవాడు. కానీ వేణుకు అలాంటి అవకాశం ఇవ్వకుండా ఈ నిబంధన తెచ్చారు.
 
మార్గదర్శి కాలేడా...
వేణుగోపాలరావు ఆటగాడిగా అద్భుతమైన ఫామ్‌లో లేకపోవచ్చు. కానీ ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో కనిపిస్తున్న కొత్త ట్రెండ్ ప్లేయర్ కంమెంటర్ పాత్రకు అతను సరిగ్గా సరిపోతాడు. 120 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 7 వేలకు పైగా పరుగులు చేసిన అనుభవం అతనికి ఉంది. ఇప్పుడు ఆంధ్ర టీమ్‌లో ఎక్కువ మంది కుర్రాళ్లే ఉన్నారు. వారితో కలిసి ఆడుతూ, వారిలో భాగమై రంజీ ట్రోఫీలో వారిని సరైన దిశలో నడిపించగల వ్యక్తి జట్టుకు అవసరం. బయటి వ్యక్తికంటే మన మనిషిగా అతను ఆటగాళ్లందరితో కలిసిపోగలడు. ప్రస్తుతం ఆంధ్ర జట్టు గ్రూప్ ‘సి’లో ఉంది. ఇప్పుడు సీనియర్‌గా బాధ్యతలు చూడగలిగే మరో మంచి ప్రత్యామ్నాయం కూడా ఆంధ్ర వద్ద ఏమీ లేదు. సీనియర్ పేరు చెప్పి 36 ఏళ్ల బద్రీనాథ్‌ను హైదరాబాద్ తెచ్చుకుంటున్నప్పుడు నేను ఆడతానంటూ ముందుకు వస్తున్న 34 ఏళ్ల వేణుగోపాలరావును కాదనడంలో అర్థం లేదు.
 
వీరికంటే మెరుగు కాదా..?
అమోల్ మజుందార్ రెండేళ్ల కెప్టెన్సీలో ఆంధ్రకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. రెండో సీజన్‌లో అరుుతే అతను నా వల్ల కావడం లేదంటూ నాలుగు మ్యాచ్‌ల తర్వాతే చేతులెత్తేసి తప్పుకున్నాడు. మొహమ్మద్ కైఫ్ అరుుతే గత సీజన్‌లో 13 ఇన్నింగ్‌‌స లలో 27.50 సగటుతో కేవలం 330 పరుగులు చేశాడు. దాంతో ఆంధ్ర అతడిని ఈసారి వద్దనుకుంది. వేణుగోపాలరావు నుంచి ఇంతకంటే మెరుగైన ప్రదర్శనను ఆశించవచ్చు. గత ఏడాది వరకు హైదరాబాద్‌కు ఆడిన హనుమ విహారి, డీబీ రవితేజ ఈసారి ఆంధ్ర తరఫున ఆడేందుకు వెళ్లారు. వీరిద్దరు పుట్టిన ప్రాంతం ఆంధ్ర (కాకినాడ) కాబట్టి ఇంత కాలం ఆడినదానితో సంబంధం లేకుండా వీరిని సొంత ఆటగాళ్లుగానే పరిగణిస్తున్నారు. వీరికి ఎలాంటి నిబంధనల అడ్డంకులు లేవు. ఈ సీజన్‌లో కొత్తగా గుజరాత్ నుంచి వచ్చిన భార్గవ్ భట్‌కు ఆంధ్ర అవకాశం కల్పిస్తోంది. మరి వేణుగోపాలరావును మాత్రం దూరం పెట్టడంలో ఔచిత్యం అనిపించుకోదు.
 
కొందరికే కష్టం..?
వేణు తిరిగి ఆంధ్ర తరఫున ఆడతానని రాగానే ఏసీఏలోని మెజారిటీ వ్యక్తులు సంతోషించారు. ‘అరువు’ అవసరం లేకుండా సీనియర్ ఉన్నాడులే అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఏసీఏలో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి మాత్రం వేణును అడ్డుకుంటున్నారు. త్వరలో లోధా కమిటీ నిబంధనలు అమల్లోకి వస్తే ప్రస్తుత ఏసీఏ కార్యవర్గంలో మార్పులు జరగాలి. కార్యదర్శిగా ఉన్న గోకరాజు గంగరాజు తప్పుకోవాలి. ఆయన తన కుమారుడిని కార్యదర్శిని చేయడానికి రంగం సిద్ధం చేశారు కూడా. ఈ సమయంలో ఏసీఏలో కీలకమైన వ్యక్తులతో విభేదించడం అనవసరమని ఆయన భావించినట్లున్నారు. కానీ ఇలా వ్యక్తుల అవసరాలు, ఈగోలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే... నష్టపోయేది మాత్రం ఆంధ్ర క్రికెట్టే.
 
‘ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆడిన వాళ్లు తిరిగి వస్తే ఒక సంవత్సరం ఆడించకూడదనే నిబంధన మేమే పెట్టుకున్నాం. గతంలో వేరే రాష్ట్రానికి ఆడి ఇప్పుడు ఇక్కడ ఆడతా అంటే కుదరదు. ఇక్కడ చాలా మంది యువ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. జట్టుకు ఉపయోగపడతారనుకుంటే బయటి రాష్ట్రాల సీనియర్లను తీసుకుంటాం’.
- గోకరాజు గంగరాజు, ఏసీఏ కార్యదర్శి

>
మరిన్ని వార్తలు