సెరెనా జోరు

4 Jun, 2015 00:16 IST|Sakshi

 కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌పై గురిపెట్టిన అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. మహిళల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సెరెనా 6-1, 6-3తో 17వ సీడ్ సారా ఎరాని (ఇటలీ)పై అలవోక విజయం సాధించింది. గత మూడు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థికి తొలి సెట్‌ను కోల్పోయిన సెరెనా ఈసారి మాత్రం ఎలాంటి తడబాటుకు లోనుకాకుండా వరుస సెట్‌లలో మ్యాచ్‌ను ముగించింది.
 
 2012లో ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ఎరాని ఆరంభంలోనే 1-3తో వెనుకబడి కోలుకోలేకపోయింది. ఏడో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకున్న సెరెనా 27 నిమిషాల్లో తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో ఏడో గేమ్‌లో ఎరాని సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా 4-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో సుదీర్ఘంగా సాగిన తొమ్మిదో గేమ్‌లో మరోసారి ఎరాని సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా విజయాన్ని ఖాయం చేసుకుంది.
 
 మరో క్వార్టర్ ఫైనల్లో 23వ సీడ్ టిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 6-4, 7-5తో అలీసన్ వాన్ ఉత్వాంక్ (బెల్జియం)పై గెలిచి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. 2001లో మార్టినా హింగిస్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ చేరిన రెండో స్విస్ క్రీడాకారిణి బాసిన్‌స్కీ.
 

>
మరిన్ని వార్తలు