షరపోవాపై రెండేళ్ల నిషేధం

9 Jun, 2016 07:24 IST|Sakshi
షరపోవాపై రెండేళ్ల నిషేధం

లండన్: డోపింగ్‌లో పట్టుబడ్డ రష్యా స్టార్ మరియా షరపోవాపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) బుధవారం రెండేళ్ల నిషేధం విధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా నిర్వహించిన డోప్ పరీక్షలో ఆమె నిషేధిత ఉత్ప్రేరకం ‘మెల్డోనియం’ వాడినట్లు తేలింది. తర్వాత ఫిబ్రవరిలో పోటీలు లేని సమయంలోనూ జరిపిన పరీక్షలోనూ ఇదే ఫలితం రావడంతో సస్పెన్షన్ వేటు పడింది.  టెన్నిస్ స్టార్ మోసం చేయాలని ప్రయత్నించకపోయినా బాధ్యతరాహిత్యంగా ప్రవర్తించిందని కేసును విచారించిన త్రిసభ్య ప్యానెల్ అభిప్రాయపడింది.

షరపోవా ఉద్దేశపూర్వకంగా ఈ మందును వాడలేదని న్యాయవాదులు ఎన్ని వాదనలు వినిపించినా ప్యానెల్ పరిగణనలోకి తీసుకోలేదు.  తనపై రెండేళ్ల నిషేధం విధించడం దారుణమని షరపోవా వ్యాఖ్యానించింది.  ‘కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్’లో అప్పీలు చేస్తానని స్పష్టం చేసింది.  నన్ను దోషిగా చిత్రీకరించేందుకు ఐటీఎఫ్ చాలా ప్రయత్నాలు చేసింది. నన్ను నాలుగేళ్లపాటు సస్పెండ్ చేయమని కూడా కోరిందంట. కానీ ట్రిబ్యునల్ వాటన్నింటినీ తోసిపుచ్చింది’ అని షరపోవా పేర్కొంది.

>
మరిన్ని వార్తలు