10 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశారు..

2 Nov, 2017 11:27 IST|Sakshi

న్యూఢిల్లీ:మూడు ట్వంటీ 20ల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా 53 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా టీ 20 ఫార్మాట్ లో కివీస్ పై తొలి విజయాన్ని అందుకున్న భారత్ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. అయితే ఈ క్రమంలోనే భారత ఓపెనర్లు శిఖర్ ధావన్-రోహిత్ శర్మలు మరో రికార్డును బద్ధలు కొట్టారు. పొట్టి ఫార్మాట్ లో 10 ఏళ్లుగా ఉన్న టీమిండియా ఓపెనింగ్ రికార్డును ఈ జోడి చెరిపేసింది.

నిన్నటి మ్యాచ్ లో ధావన్-రోహిత్ లు 158 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. ఫలితంగా గంభీర్ -సెహ్వాగ్ ల జోడి నెలకొల్సిన ఓపెనింగ్ రికార్డు బద్ధలైంది. 2007 టీ 20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ పై గంభీర్-సెహ్వాగ్ ల జోడి 136 పరుగుల భాగస్వామ్యం సాధించింది. ఇదే ఇప్పటివరకూ టీ 20ల్లో భారత్ కు అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. దాన్ని శిఖర్-రోహిత్ లు బ్రేక్ చేసి సరికొత్త రికార్డును లిఖించారు. ఓవరాల్ గా చూస్తే ఇది మొదటి వికెట్ కు మూడో అత్యుత్తమ భాగస్వామ్యం. మరొకవైపు రోహిత్-ధావన్ ల భాగస్వామ్యం కేవలం టీ 20ల్లో భారత్ తరపున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యమే కాకుండా, ఏ వికెట్ కు చూసిన టీమిండియా అత్యుత్తమ భాగస్వామ్యంగా నమోదు కావడం మరో విశేషం. ఈ క్రమంలోనే రోహిత్-కోహ్లిలు నెలకొల్పిన రికార్డు బద్దలైంది.

మరిన్ని వార్తలు