ఏం చేయాలో, ఎలా ఆడాలో తెలుసు : ధావన్‌

18 Jan, 2019 10:03 IST|Sakshi

మెల్‌బోర్న్‌ : టీమిండియా స్టార్‌ క్రికెటర్‌‌, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ గొప్ప ఆటగాడిగానే కాకుండా.. గొప్ప తండ్రిగా కూడా పేరు తెచ్చుకుంటాడని ఓపెనర్‌ ధావన్‌ అన్నాడు. శుక్రవారం మీడియాతో ముచ్చటించిన ధావన్‌.. ‘రోహిత్‌ శర్మ తండ్రిగా ప్రమోషన్‌ పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. రోహిత్‌, రితికకు శుభాకాంక్షలు. చాలా ఏళ్లుగా రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడుతున్నా. తనతో కలిసి ఆడటం నాకెంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఏం చేయాలో, ఎలా ఆడాలో ఇద్దరికీ తెలుసు.  మా ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్‌ ఉంది. ఒకరితో ఒకరం మాట్లాడుకోవాల్సిన అవసరం లేకుండానే సమయానికి తగినట్లుగా బ్యాటింగ్‌ చేస్తాం. ఇకపై కూడా అదే కొనసాగుతుంది’ అని వ్యాఖ్యానించాడు.

కాగా రోహిత్‌ శర్మ భార్య రితిక డిసెంబరు 30న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్‌ టూర్‌లో ఉన్న రోహిత్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా చివరిదైన నాల్గో టెస్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు జట్టుతో కలిసిన రోహిత్‌ సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో అద్భుతమైన శతకం బాది..  ఆసీస్‌ జట్టుపై అత్యధిక వన్డే  సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఇక తొలి వన్డేలో పరాజయం చవిచూసిన భారత్‌.. అడిలైడ్‌ వన్డేలో గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ప్రస్తుతం(శుక్రవారం)  మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న టీమిండియా.. 24 ఓవర్లు పూర్తయ్యేసరికి 101 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసింది.

మరిన్ని వార్తలు