షూటింగ్‌ ప్రపంచ కప్‌ వాయిదా 

7 Mar, 2020 01:57 IST|Sakshi

కోవిడ్‌–19 వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ నిర్ణయం

న్యూఢిల్లీ: దేశంలో జరగాల్సిన ప్రతిష్టాత్మక షూటింగ్‌ ప్రపంచ కప్‌ టోర్నమెంట్‌కు కోవిడ్‌–19 వైరస్‌ అడ్డుగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్‌ విజృంభిస్తుండటంతో పాటు... దేశంలో కూడా పలు కేసులు నమోదు కావడంతో ఈ మెగా ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ షూటింగ్‌ స్పోర్ట్‌ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 15 నుంచి 25 వరకు న్యూఢిల్లీ వేదికగా ఈ ఈవెంట్‌ జరగాల్సి ఉంది.

అయితే భారత్‌లో 31 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కావడం... కోవిడ్‌ తీవ్రత అధికంగా ఉన్న చైనా, ఇటలీ, దక్షిణ కొరియా, జపాన్, ఇరాన్‌ దేశాలపై భారత ప్రభుత్వం ట్రావెల్‌ బ్యాన్‌ విధించడంతో టోర్నీని ప్రస్తుతం నిర్వహించడం సాధ్యం కాదని ఐఎస్‌ఎస్‌ఎఫ్‌కు భారత జాతీయ రైఫిల్‌ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ)  తెలిపింది. అంతేకాకుండా టోర్నీలో పాల్గొనే 22 దేశాలు కూడా చివరి నిమిషంలో వైదొలిగాయని పేర్కొంది. అయితే షూటింగ్‌ ప్రపంచ కప్‌ను రెండు దశల్లో నిర్వహించే విషయమై పరిశీలిస్తున్నామని ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ పేర్కొంది. మే 5 నుంచి 12 మధ్య రైఫిల్, పిస్టల్‌ ఈవెంట్‌లను... జూన్‌ 2–9 మధ్య షాట్‌గన్‌ షూటింగ్‌ పోటీలను నిర్వహించాలని ఎన్‌ఆర్‌ఏఐ తమను కోరినట్లు ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ తెలిపింది. దీంతో పాటు ఏప్రిల్‌ 16 నుంచి టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్‌ టెస్టు ఈవెంట్‌ కూడా రద్దు అయింది.

బయోమెట్రిక్‌కు ‘బ్రేక్‌’ ఇచ్చిన ‘సాయ్‌’ 
అథ్లెట్లు, సిబ్బంది హాజరు కోసం ఉపయోగిస్తున్న బయోమెట్రిక్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) తెలిపింది. బయోమెట్రిక్‌ ద్వారా కోవిడ్‌–19 ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘సాయ్‌’ తెలిపింది.

అనుకున్న సమయానికే ఐపీఎల్‌: గంగూలీ 
కోవిడ్‌ దెబ్బకు ఒక్కో టోర్నీ వాయిదా పడుతున్నా... బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మాత్రం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నీ సీజన్‌–13 అనుకున్న తేదీనే ప్రారంభమవుతుందని స్పష్టం చేశాడు. వైరస్‌ ప్రబలకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటామని... దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయన అన్నాడు. ఐపీఎల్‌ తాజా సీజన్‌ మార్చి 29న ప్రారంభమవుతుంది.

>
మరిన్ని వార్తలు