శుబ్‌మన్‌ మళ్లీ శతకం మిస్‌

18 Sep, 2019 02:50 IST|Sakshi

రాణించిన కరుణ్‌ నాయర్‌

భారత్‌ ‘ఎ’ 233/3  

మైసూర్‌: యువ బ్యాట్స్‌మన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (137 బంతుల్లో 92; 12 ఫోర్లు, సిక్స్‌) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దక్షిణాఫ్రికా ‘ఎ’తో మంగళవారం ఇక్కడ ప్రారంభమైన రెండో అనధికారిక నాలుగు రోజుల టెస్టులో అతడు శతకానికి 8 పరుగుల దూరంలో ఔటయ్యాడు. తొలి మ్యాచ్‌లో శుబ్‌మన్‌ 90 పరుగులు చేశాడు. ప్రస్తుత మ్యాచ్‌లో అతడికి తోడు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కరుణ్‌ నాయర్‌ (167 బంతుల్లో 78 బ్యాటింగ్‌; 10 ఫోర్లు) రాణించడంతో భారత్‌ ‘ఎ’ తొలి రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.

మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ (5), ప్రియాంక్‌ పాంచల్‌ (6) త్వరగానే వెనుదిరిగినా... శుబ్‌మన్, నాయర్‌ మూడో వికెట్‌కు 135 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. దక్షిణాఫ్రికా టెస్టు జట్టు సభ్యులైన పేసర్లు ఫిలాండర్, ఇన్‌గిడి, స్పిన్నర్‌ ముతుస్వామిలను దీటుగా ఎదుర్కొన్నారు. సిపామ్లా బౌలింగ్‌లో గిల్‌ పెవిలియన్‌ చేరాక... కరుణ్‌కు కెపె్టన్‌ వృద్ధిమాన్‌ సాహా (86 బంతుల్లో 36; 5 ఫోర్లు) సహకారం అందించాడు. అబేధ్యమైన నాలుగో వికెట్‌కు వీరు 67 పరుగులు జోడించారు. వెలుతురు సరిగా లేని కారణంగా మంగళవారం 74 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.   

మరిన్ని వార్తలు