శ్రీకాంత్‌  జాక్‌పాట్‌

15 Jan, 2019 02:14 IST|Sakshi

నాలుగేళ్ల కాలానికి ‘లి–నింగ్‌’తో రూ. 35 కోట్ల ఒప్పందం

న్యూఢిల్లీ: భారత స్టార్‌ షట్లర్, తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్‌ బ్రాండింగ్‌ ప్రపంచంలో బ్రహ్మాండంగా మెరిశాడు. క్రికెటేతర ఆటగాళ్లలో రికార్డు మొత్తానికి భారీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. చైనా స్పోర్ట్స్‌ బ్రాండ్‌ ‘లి–నింగ్‌’ నాలుగేళ్ల కాలానికి శ్రీకాంత్‌తో రూ.35 కోట్లకు డీల్‌ కుదుర్చుకుంది. ఇందులో రూ. 30 కోట్లు స్పాన్సర్‌షిప్‌ మొత్తంగా అందించనుండగా... మరో రూ. 5 కోట్ల విలువైన క్రీడా సామగ్రిని లి–నింగ్‌ అందిస్తుంది. 2023 వరకు ఈ ఒప్పందం కొనసాగుతుందని శ్రీకాంత్‌ వ్యవహారాలు చూసే బేస్‌లైన్‌ వెంచర్స్‌ సంస్థ వెల్లడించింది. ఒప్పంద కాలంలో భారత షట్లర్‌ ఆ సంస్థకు చెందిన క్రీడోపకరణాలే వాడటంతో పాటు మ్యాచ్‌లు ఆడేటపుడు కూడా లి–నింగ్‌ దుస్తులే ధరించాల్సి ఉంటుంది.

కెరీర్‌లో ఆరు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ గెలిచిన శ్రీకాంత్‌ గత ఏడాది వరల్డ్‌ నంబర్‌వన్‌గా కూడా నిలిచాడు. ప్రస్తుతం అతను ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నాడు. గతంలో రెండేళ్ల పాటు (2014–15) శ్రీకాంత్‌   లి–నింగ్‌కు ప్రచారకర్తగా ఉన్నాడు. అయితే ఆ తర్వాత అతను ప్రముఖ జపాన్‌ సంస్థ ‘యోనెక్స్‌’తో జత కలిశాడు. చైనాకు చెందిన లి–నింగ్‌ సంస్థ తమ దేశంతో పాటు ఇండోనేసియా, సింగపూర్, ఆస్ట్రేలియా బ్యాడ్మింటన్‌ టీమ్‌లకు కిట్‌లను అందిస్తోంది.  2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత బృందానికి స్పాన్సర్‌గా వ్యవహరించిన లి–నింగ్‌... 2020 టోక్యో ఒలింపిక్స్‌ వరకు కూడా భారత జట్టుతో ఒప్పందం కొనసాగించనుంది.    

మరిన్ని వార్తలు