సిక్కి–అశ్విని జంట శుభారంభం   

27 Mar, 2019 01:25 IST|Sakshi

డబుల్స్‌ తొలి రౌండ్‌లో ఆరో సీడ్‌ జోడీపై విజయం

ఇండియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీ 

నేడు జరిగే పురుషుల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో థమాసిన్‌ (థాయ్‌లాండ్‌)తో గురుసాయిదత్‌; వోంగ్‌ వింగ్‌ కి విన్సెంట్‌ (హాంకాంగ్‌)తో శ్రీకాంత్‌; కార్తికేయ్‌ (భారత్‌)తో సాయిప్రణీత్‌; లీ చెయుక్‌ యియు (హాంకాంగ్‌)తో పారుపల్లి కశ్యప్‌; జాన్‌ జార్గెన్‌సన్‌ (డెన్మార్క్‌)తో రాహుల్‌ యాదవ్‌ తలపడతారు. మహిళల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో చనాన్‌చిదా జుచారోయెన్‌ (థాయ్‌లాండ్‌)తో గుమ్మడి వృశాలి; ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌)తో చుక్కా సాయిఉత్తేజిత రావు; హి బింగ్‌జియావో (చైనా)తో ప్రాషి జోషి; ముగ్ధా ఆగ్రేతో పీవీ సింధు ఆడతారు.   

న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత మహిళల డబుల్స్‌ నంబర్‌వన్‌ జంట నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప అద్భుత ప్రదర్శన చేసింది. మంగళవారం మొదలైన ఇండియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో సంచలన విజయంతో శుభారంభం చేసింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి– అశ్విని ద్వయం 22–20, 21–19తో ఆరో సీడ్, ప్రపంచ 18వ ర్యాంక్‌ జోడీ లి వెన్‌మె–జెంగ్‌ యు (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇతర డబుల్స్‌ మ్యాచ్‌ల్లో రాచపల్లి లీలాలక్ష్మి–వర్ష బేలవాడి (భారత్‌) ద్వయం 2–21, 7–21తో కితితారకుల్‌–రవింద (థాయ్‌లాండ్‌) జోడీ చేతిలో... జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్‌ (భారత్‌) జంట 16–21, 19–21తో లైసువాన్‌–మింగ్‌చువా (థాయ్‌లాండ్‌) జోడీ చేతిలో ఓడిపోయాయి.  

మెయిన్‌ ‘డ్రా’కు రాహుల్‌ యాదవ్, ప్రాషి 
ఊహించినట్టే క్వాలిఫయింగ్‌ విభాగంలో ఆతిథ్య భారత క్రీడాకారులు ఆధిపత్యాన్ని చాటుకున్నారు. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్‌లలో అందుబాటులో ఉన్న మొత్తం ఎనిమిది బెర్త్‌లను భారత క్రీడాకారులే సంపాదించడం విశేషం. పురుషుల డబుల్స్‌లో నాలుగు, మహిళల డబుల్స్‌లో మూడు, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మరో మూడు బెర్త్‌లు భారత్‌ ఖాతాలోకే వచ్చాయి.  పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్‌ ఆటగాడు చిట్టబోయిన రాహుల్‌ యాదవ్‌తోపాటు కార్తీక్‌ జిందాల్, సిద్ధార్థ్‌ ఠాకూర్, కార్తికేయ్‌ గుల్షన్‌ కుమార్‌ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందారు. క్వాలిఫయింగ్‌లో రాహుల్‌ తొలి మ్యాచ్‌లో 21–11, 21–12తో రేపూడి అనీత్‌ కుమార్‌ (భారత్‌)పై, రెండో మ్యాచ్‌లో 21–14, 21–15తో అనంత్‌ శివం జిందాల్‌ (భారత్‌)పై గెలుపొందాడు. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో సిద్ధార్థ్‌ ఠాకూర్‌ 21–6, 21–13తో గుర్‌ప్రతాప్‌ సింగ్‌ (భారత్‌)పై, కార్తీక్‌ 21–12, 21–23, 21–19తో దున్నా శరత్‌ (భారత్‌)పై, కార్తికేయ్‌ 21–16, 21–13తో సిద్ధార్థ్‌ (భారత్‌)పై విజయం సాధించారు. మహిళల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌లో హైదరాబాద్‌ అమ్మాయి ప్రాషి జోషి 21–14, 21–17తో శ్రుతి ముందాడ (భారత్‌)పై, రితిక 21–6, 21–6తో దోహ హనీ (ఈజిప్ట్‌)పై గెలిచారు. భారత్‌కే చెందిన రియా ముఖర్జీ, వైదేహిలకు తమ ప్రత్యర్థుల నుంచి వాకోవర్‌ లభించింది.   

మరిన్ని వార్తలు