సిరాజ్‌కు చాన్స్ దక్కేనా?

20 Jan, 2017 10:48 IST|Sakshi
సిరాజ్‌కు చాన్స్ దక్కేనా?

రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టులో చోటు దక్కించుకున్న హైదరాబాద్ పేసర్
 నేటి నుంచి గుజరాత్‌తో ఇరానీ కప్ పోరు
 
ముంబై: ఇటీవలి కాలంలో విశేషంగా రాణిస్తున్న హైదరాబాదీ యువ పేసర్ మొహమ్మద్ సిరాజ్ మరోసారి తన సత్తా చూపించుకునేందుకు చక్కటి అవకాశం లభించింది. నేటి (శుక్రవారం) నుంచి బ్రబౌర్న్ మైదానంలో రంజీ చాంపియన్ గుజరాత్‌తో జరిగే ఇరానీ కప్‌లో సిరాజ్ రెస్టాఫ్ ఇండియా జట్టు తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన రెస్టాఫ్ ఇండియా జట్టులో 22 ఏళ్ల సిరాజ్‌కు చోటు దక్కలేదు. అయితే పేసర్ శార్దుల్ ఠాకూర్ గాయం కారణంగా తప్పుకోవడంతో సిరాజ్‌కు అదృష్టం వరించింది. గత నెల ముంబైతో జరిగిన రంజీ క్వార్టర్స్‌లో సిరాజ్ తన బౌలింగ్ ప్రతిభేమిటో చాటుకున్నాడు.
 
 తొలి ఇన్నింగ్‌‌సలో నాలుగు, రెండో ఇన్నింగ్‌‌సలో ఐదు వికెట్లు తీసిన సిరాజ్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇప్పటిదాకా కేవలం 10 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన అతను 42 వికెట్లు పడగొట్టాడు. తుది జట్టులో చోటు దక్కితే మాత్రం పూర్తి స్థాయిలో అవకాశాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నాడు.
 
 మరోవైపు టెస్టు జట్టులో సుదీర్ఘ విరామం తర్వాత వికెట్ కీపర్‌గా చోటు దక్కించుకున్న గుజరాత్ కెప్టెన్ పార్థివ్ పటేల్‌కు, గాయం నుంచి కోలుకున్న రెగ్యులర్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌ను వీరి మధ్య పోటీగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. నిజానికి టెస్టు జట్టు ఇప్పుడు చాలా పటిష్టంగా ఉంది. ఇప్పటికిప్పుడు అక్కడ భర్తీ చేయాల్సిన ఖాళీలు కూడా లేవు. అయితే మున్ముందు స్వదేశంలో భారత్ ఐదు టెస్టులు ఆడబోతోంది. దీంతో భవిష్యత్‌లోనైనా తమ పేర్లను పరిగణనలోకి తీసుకోవాలంటే ఇరానీ కప్‌లాంటి ముఖ్యమైన టోర్నీలో విశేషంగా రాణించాలనే ఆలోచనతో ఆటగాళ్లున్నారు.

 

మరిన్ని వార్తలు