ఆ రాత్రి సచిన్‌ నన్ను భయపెట్టాడు : గంగూలీ

6 Aug, 2018 11:18 IST|Sakshi

భారత క్రికెట్‌ చరిత్రలో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, బెంగాల్‌ దాదా సౌరవ్‌ గంగూలీలకు విశిష్ట  స్థానముందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ఈ దిగ్గజాలు మంచి స్నేహితులు కూడా. బ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ చాంపియన్స్‌ షోలో పాల్గొన్న గంగూలీ.. తమ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రస్తావిస్తూ సచిన్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 14వ ఏట నుంచే సచిన్‌తో కలిసి క్రికెట్‌ ఆడానన్న గంగూలీ.. హిట్‌ ఓపెనింగ్‌ జోడీగా పేరు తెచ్చుకున్నామని పేర్కొన్నాడు. ‘చిన్ననాటి నుంచి సచిన్‌ ను దగ్గరిగా చూశాను. క్రీజులో ఉన్నప్పుడు సచిన్‌ ఆలోచనలు ఏవిధంగా ఉంటాయో, ఎవరిపై ఎప్పుడు అతడికి కోపం వస్తుందో నాకన్నీ ఇట్టే తెలిసిపోయేవని’ వ్యాఖ్యానించాడు.

సచిన్‌, వినోద్‌ కాంబ్లీ ఆటపట్టించేవారు..
‘ఇండోర్‌ నేషనల్‌ క్యాంపులో పాల్గొన్న మమ్మల్ని.. ప్రాక్టీస్‌లో భాగంగా వాసు సార్‌ బాగా పరిగెత్తించేవారు. ఆదివారం మధ్యాహ్నం మాత్రమే మాకు సెలవు ఉండేది. అలా ఓ ఆదివారం మధ్యాహ్నం నా రూమ్‌మేట్స్‌ సచిన్‌, కాంబ్లీ, నేను నిద్రపోయాం. కానీ సాయంత్రం ఐదింటికి లేచి చూసేసరికి వారిద్దరు నా పక్కన లేరు. గది మొత్తం నీళ్లతో నిండిపోయింది. బాత్‌రూమ్‌తో పైప్‌ లీకయ్యి నీళ్లు వస్తున్నాయనకున్నా. కానీ తలుపు తెరచి చూడగా అసలు విషయం అర్థమైంది. ఇదంతా వారిద్దరి పనేనని. నన్ను లేపేందుకే కాంబ్లీ, సచిన్‌లు బకెట్లతో నీళ్లు తెచ్చి గది ముందు కుమ్మరించారంటూ’ ఆనాటి చిలిపి సంఘటనను గుర్తు చేసుకున్నారు.

సచిన్‌ నన్ను భయపెట్టాడు..
ఎన్నోసార్లు సచిన్‌తో రూమ్‌ షేర్‌ చేసుకున్నానన్న దాదా.. ‘ఓ రోజు అర్ధరాత్రి సచిన్‌ రూమ్‌లో అటూ ఇటూ నడుస్తున్నాడు. దేనికోసమైనా వెదుకుతున్నాడోమో అనుకుని నేను పడుకున్నాను. కానీ మరుసటి రోజు కూడా అలాగే చేశాడు. రూమ్‌ అంతా తిరిగి తిరిగి సడన్‌గా వచ్చి నా పక్కన పడుకున్నాడు. వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. నాకేమీ అర్థం కాలేదు. సచిన్‌ ప్రవర్తన చూసి భయమేసింది. తెల్లవారి జరిగిందంతా తనకు చెప్పి.. ఎందుకిలా చేశావని అడిగితే.. నాకు నిద్రలో లేచి నడిచే అలవాటుందంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు. అప్పటిదాకా అసలు నిజం తెలియక భయపడి చచ్చా’  అంటూ ఇంగ్లండ్‌లో తనకు ఎదురైన సరదా సంఘటన గురించి చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు