‘థ్యాంక్యూ’...

5 Nov, 2019 03:33 IST|Sakshi

ఇరు జట్లకు గంగూలీ కృతజ్ఞతలు

న్యూఢిల్లీ: తీవ్ర కాలుష్యం నగరాన్ని కమ్మేసిన సమయంలో కూడా ఆదివారం భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య టి20 మ్యాచ్‌ మాత్రం ఆగలేదు. ఇరు జట్లు కూడా ఎలాంటి ఫిర్యాదు చేయకుండా ఆటను కొనసాగించాయి. ఒక దశలో రద్దు అవుతుందేమో అనిపించినా... అవాంతరం లేకుండా నిర్ణీత సమయం ప్రకారమే మ్యాచ్‌ జరిగింది. దాంతో  బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఊపిరి పీల్చుకున్నాడు. రెండు జట్లకు కూడా అతను కృతజ్ఞతలు చెప్పాడు. ‘కఠిన పరిస్థితుల మధ్య మ్యాచ్‌ ఆడినందుకు ఇరు జట్లకు కృతజ్ఞతలు. బాగా ఆడిన బంగ్లా జట్టుకు అభినందనలు’ అని గంగూలీ ట్వీట్‌ చేశాడు. మరోవైపు ఢిల్లీ మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదని బయటకు చెప్పినా... సౌమ్య సర్కార్‌తో పాటు మరో బంగ్లా క్రికెటర్‌ కాలుష్యం దెబ్బకు తట్టుకోలేక మైదానంలో వాంతి చేసుకున్నట్లు సమాచారం.

‘మహా’ ఆపుతుందా! 
భారత్, బంగ్లా మధ్య గురువారం రెండో టి20 మ్యాచ్‌ జరగడంపై సందేహాలు రేగుతున్నాయి. ఈ మ్యాచ్‌కు వేదిక అయిన రాజ్‌కోట్‌ తీవ్రమైన తుఫాన్‌ ‘మహా’ బారిన పడే అవకాశం కనిపిస్తోంది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం గుజరాత్‌ తీరానికి వంద కిలోమీటర్ల దూరంలోనే ఉన్న రాజ్‌కోట్‌పై తుఫాన్‌ ప్రభావం ఉండవచ్చు. ‘మహా’ కారణంగా 6, 7 (మ్యాచ్‌ జరిగే రోజు) తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే మ్యాచ్‌ సమయానికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నట్లు సౌరాష్ట్ర క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు జైదేవ్‌ షా అన్నారు.

మరిన్ని వార్తలు