కుప్పకూలిన దక్షిణాఫ్రికా

26 Jan, 2020 02:22 IST|Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ 3 వికెట్లు తీశాడు. డికాక్‌ (32 బ్యాటింగ్‌) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 192/4తో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైంది. జో రూట్‌ (59), ఒలీ పోప్‌ (56) అర్ధ సెంచరీలు చేశా రు. ప్రొటీస్‌ బౌలర్‌ నోర్జే 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు.  

స్టోక్స్‌పై ఐసీసీ చర్య
మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో అభిమానిని అభ్యంతరకర పదజాలంతో దూషించిన ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చర్య తీసుకుంది. అతని మ్యాచ్‌ ఫీజులో 15 శాతం జరిమానాతో పాటు ఒక డీ మెరిట్‌ పాయింట్‌ను శిక్షగా విధించింది. శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌లో అతను అవుటై డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళుతున్న సమయంలో ఒక దక్షిణాఫ్రికా అభిమాని అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. దాంతో స్టోక్స్‌ ‘గ్రౌండ్‌ బయటకు వచ్చి అదే మాట అని చూడు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అదే రీతిలో స్పందిస్తూ బూతు మాటలతో జవాబిచ్చాడు. అయితే ఆ తర్వాత స్టోక్స్‌ ఈ ఘటనపై క్షమాపణ కోరాడు. దీనిపై విచారణ జరిపిన ఐసీసీ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ చర్య తీసుకున్నాడు.
 

మరిన్ని వార్తలు