అదే... అతడికి అడ్డంకి!

1 Mar, 2018 01:13 IST|Sakshi
మయాంక్‌ అగర్వాల్‌

మయాంక్‌... మరికొంత కాలం వేచి చూడాలి

స్థిరత్వంతోనే జాతీయ జట్టులోకి పిలుపు   

ఈ దేశవాళీ సీజన్‌లో ఇప్పటికి 2141 పరుగులు... 30 ఇన్నింగ్స్‌లలో 8 శతకాలు... చివరి 9 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా ఐదు అర్ధ సెంచరీలు... మూడు సెంచరీలు... ఇవి ఒక జట్టులోని ప్రధాన బ్యాట్స్‌మెన్‌ గణాంకాలు కాదు! కర్ణాటక ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ కళ్లు చెదిరే రికార్డులు! అయినా శ్రీలంకలో జరిగే టి20 ముక్కోణపు టోర్నీలో అతనికి టీమిండియాలో చోటు దక్కలేదు! ఇంతకంటే ఇంకేం చేయాలి? మరి భారత జట్టులోకి ఎంపికకు మయాంక్‌ ఎంతవరకు అర్హుడు? ఇందుకు అడ్డంకిగా నిలుస్తున్న అంశాలేంటి?  

సాక్షి క్రీడా విభాగం: వాస్తవమే... మయాంక్‌ ప్రతిభావంతుడే. కర్ణాటకను ఈ సీజన్‌లో ఒంటిచేత్తో గెలిపించినవాడే. కరుణ్‌ నాయర్, లోకేశ్‌ రాహుల్‌ వంటివారున్న జట్టులో తన ఉనికిని బలంగా చాటుకున్నవాడే. అన్నిటికి మించి స్ట్రోక్‌ ప్లేలో డాషింగ్‌ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ను తలపించేవాడే. ఓ అవకాశం ఇచ్చి పరీక్షించదగినవాడే. అయినా... పిలుపెందుకు రాలేదు? దీనికి కారణాలు ఏమిటి? తనలో లోపం ఎక్కడుంది? సెలెక్షన్‌ కమిటీ ఆలోచన ఎలా ఉంది? అనే ప్రశ్నలు రావడం సహజం. వీటన్నిటికీ సమాధానం జాతీయ జట్టులోని పరిస్థితులు. దీంతోపాటు నిలకడ లేని అతడి గత ఆటతీరు. 

ఈ ఒక్క ప్రదర్శననే చూడలేరుగా! 
13 మ్యాచ్‌ల్లో 284 పరుగులు, సగటు 23.66... గతేడాది రంజీల్లో మయాంక్‌ ప్రదర్శనిది. మూడే అర్ధ సెంచరీలు చేశాడు. అంతకుముందు (2015–16) సీజన్‌లో 5 మ్యాచ్‌ల్లో 8 ఇన్నింగ్స్‌లలో 52.12 సగటుతో 417 పరుగులు సాధించాడు. ఈసారి మాత్రం ఒక ట్రిపుల్‌ సెంచరీ సహా నాలుగు శతకాలతో 1160 పరుగులు చేశాడు. అంటే మూడు సీజన్లలో అతడు భారీగా పరుగులు చేసింది ఈ ఏడాదే. దీనినిబట్టి అవకాశం ఇవ్వడానికి మరికొంత కాలం వేచి చూడాలని సెలెక్టర్లు భావించడంలో తప్పు లేదు. మరోవైపు నిలకడ లేమి మయాంక్‌ కెరీర్‌ ప్రారంభం నుంచి ఉంది. 2008–09లో కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో 432 పరుగులు చేసి వెలుగులోకి వచ్చిన అతడు, ఇదే ఊపులో ఆస్ట్రేలియాతో జరిగిన అండర్‌–19 వన్డేలో 160 పరుగులు చేసి సత్తా చాటాడు. కానీ 2010 కుర్రాళ్ల ప్రపంచకప్‌లో నిరాశపరిచాడు. తదనంతరం భారత్‌ ‘ఎ’ జట్టులో అవకాశం వచ్చినా విఫలమయ్యాడు. అప్పటికింకా అతడు రంజీల్లో అరగేట్రం కూడా చేయలేదు. 2013–14 సీజన్‌లో రంజీల్లోకి అడుగుపెట్టినా పోటీ కారణంగా ఈ కుడిచేతి వాటం ఓపెనర్‌కు జట్టులో చోటు కష్టంగానే ఉండేది. కేఎల్‌ రాహుల్‌ జాతీయ జట్టుకు వెళ్లాక మాత్రమే ఇతడికి స్థిరంగా అవకాశాలు వచ్చాయి. 

‘ఓపెనింగ్‌’ ఖాళీ లేదు... 
టెస్టుల్లో ధావన్, విజయ్, రాహుల్‌... వన్డేలు, టి20ల్లో రోహిత్, ధావన్‌ భారత జట్టుకు ఓపెనర్లుగా స్థిర పడిపోయారు. గాయపడితేనో, తప్పిస్తేనో తప్ప మరొకరికి చాన్స్‌ ఇవ్వలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో నిఖార్సైన ఓపెనర్‌ అయిన మయాంక్‌ను ఎంపిక చేసినా ఎక్కడ ఆడించాలో తెలియని పరిస్థితి. అప్పటికీ దక్షిణాఫ్రికాలో టెస్టుల్లో రాహుల్‌ వైఫల్యం, రంజీల్లో మయాంక్‌ అదరగొట్టడం చూసిన విశ్లేషకులు ఇతడిని తీసుకోవాలని వ్యాఖ్యానించారు. కానీ ఇదంత తేలిగ్గా తీసుకునే నిర్ణయం కాదు. ఎందుకంటే అగర్వాల్‌ ఇప్పటికి ఆడింది ఐదు రంజీ సీజన్లే. జట్టులో స్థిరంగా చోటు దక్కింది రెండు–మూడేళ్ల నుంచే.  
ఈ ఏడాది రంజీలు, విజయ్‌ హజారేలో దుమ్మురేపిన మయాంక్‌... టి20 టోర్నీ అయిన ముస్తాక్‌ అలీలో పెద్దగా ఆకట్టుకోలేదు. 9 మ్యాచ్‌ల్లో 258 పరుగులే చేశాడు. వీటిలో మూడే అర్ధ సెంచరీలున్నాయి.పైగా శ్రీలంకలో జరగనున్న నిదాహస్‌ ముక్కోణపు ట్రోఫీ టి20 ఫార్మాట్‌. ఈ లెక్కన చూసినా సెలెక్టర్ల నిర్ణయాన్ని తప్పుపట్టలేం. కాబట్టి అగర్వాల్‌ జాతీయ జట్టులో స్థానం కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి రావచ్చు.  

మరింకేం చేయాలి...? 
మయాంక్‌ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలంటే ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తూ స్థిరంగా పరుగులు చేయాలి. గతంలో ఎదురైన ఫిట్‌నెస్‌ సమస్యలు మళ్లీ తలెత్తకుండా చూసుకోవాలి. ఇదే సమయంలో టెస్టు ఓపెనర్‌ విజయ్‌ 35 ఏళ్లకు దగ్గరవుతున్నాడు. అంటే బ్యాకప్‌ను వెతుక్కోవాల్సిన సమయం. ఆ స్థానాన్ని భర్తీ చేయడాన్ని 27 ఏళ్ల అగర్వాల్‌ సవాల్‌గా తీసుకోవాలి. 

కొసమెరుపు: కర్ణాటకకు ఆడినప్పుడు ఓపెనింగ్‌లో పోటీగా మారిన కేఎల్‌ రాహులే... ఇప్పుడూ మయాంక్‌ కంటే ముందే జాతీయ జట్టులోకి వచ్చి అతడిని నిరీక్షణ జాబితాలో ఉంచాడు. 

భారత జట్టులోకి ఎంపికయ్యేందుకు తాను ఎంత చేరువగా వచ్చానో ప్రతీ ఆటగాడికి తెలియాలనేది మా భావన. వారికి ఈ విషయంలో ఎలాంటి సందేహాలు ఉండవద్దు. కాబట్టి మా కమిటీ ప్రతి ఆటగాడితో విడిగా మాట్లాడుతుంది. దేశవాళీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న మయాంక్‌ అగర్వాల్‌తో నేను స్వయంగా మాట్లాడాను. తన ఆటతో అతను మా దృష్టిలో పడ్డాడని కూడా చెప్పాను. అయితే ఎంపిక విషయంలో మాకంటూ ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తున్నాం. ఆ విధంగా చూస్తే ప్రస్తుతం వరుసలో నిలబడిన మయాంక్‌ తనకంటే ముందున్నవాళ్లను దాటి వెళ్లే పరిస్థితి లేదు. నేను చెప్పిన విషయాన్ని అతను కూడా బాగా అర్థం చేసుకున్నాడు. పైగా మీ దృష్టిలో పడితే చాలు. నాకు తొందరేమీ లేదని అతనే చెప్పాడు.    
– ఎమ్మెస్కే ప్రసాద్, చీఫ్‌ సెలక్టర్‌   

మరిన్ని వార్తలు