ప్రాక్టీస్‌ సెషన్‌కు రాలేదని క్రికెటర్‌పై నిషేదం..

5 Oct, 2017 17:15 IST|Sakshi

కొలంబో : నిబంధనలు ఉల్లంఘించినందుకు శ్రీలంక యువ క్రికెటర్‌ ధనుష్క గుణతిలకపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు వేటు వేసింది. ప్రాక్టీస్‌ సెషన్‌ను ఎగ్గొటడమే కాకుండా, బోర్డు క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు 6 అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేదంతో పాటు అతని కాంట్రాక్టులో 20 శాతం కోత విధించింది. మైదానం బయట గుణతిలక ప్రవర్తనను పరిగణలోకి తీసుకొని సస్పెండ్‌ చేసినట్లు లంక బోర్డు అధికారులు తెలిపారు. ఈ నిషేదం సెప్టెంబర్‌ 30 నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

ఇటీవల భారత్‌తో టెస్టు, వన్డే సిరీస్‌ సమయంలో ఓ మ్యాచ్‌ ఆడేందుకు మైదానానికి వస్తూ తన బ్యాటింగ్‌ కిట్‌ను తీసుకురాకుండా వచ్చాడు. ఇవన్నీ గుర్తించిన బోర్డు తాజాగా 6 మ్యాచుల నిషేధాన్ని విధిస్తూ చర్యలు తీసుకుంది. భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనే గుణతిలక టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అనంతరం ఐదు వన్డేలకు ఎంపికైన గుణతిలక రెండు వన్డేల తర్వా గాయంతో దూరమయ్యాడు. ప్రస్తుతం శ్రీలంక జట్టు దుబాయ్‌లో పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌ ఆడుతోంది. తొలి టెస్టులో శ్రీలంక విజయం సాధించగా రెండో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ సస్పెన్షన్‌తో టెస్టు సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో గుణతిలకకు చోటు దక్కలేదు.

మరిన్ని వార్తలు