టీమిండియా క్రికెటర్లకు కాసుల పంట!

7 Mar, 2018 19:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట​ర్లకు భారీ కాంట్రాక్టు పంట పండింది. టాప్‌ గ్రేడ్‌ క్రికెటర్లకు ఏకంగా రూ.7 కోట్ల భారీ ప్యాకేజీ అందించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఏ+, ఏ, బీ, సీ అని మొత్తం నాలుగు విభాగాలుగా కాంట్రాక్టులకు బీసీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏ+ గ్రేడ్‌ కేటగిరిలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, శిఖర్‌ ధావన్‌, జస్ప్రిత్‌ బూమ్రాలుండగా.. వీరి కాంట్రాక్ట్‌ కింద భారీ స్థాయిలోరూ. 7కోట్ల వేతనం అందనుంది. మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ఆడుతూ రాణిస్తున్న వారికి ఈ గ్రేడ్‌ ఇచ్చారు. గతంలో టాప్‌ గ్రేడ్‌ ఆటగాళ్లకు రూ.2 కోట్ల మేర ప్యాకేజీ అందేది.

ఏ గ్రేడ్‌ కేటగిరిలో 7 మంది ఆటగాళ్లున్నారు. ఎంఎస్‌ ధోని, అశ్విన్‌, జడేజా, అజింక్య రహానే, మురళీ విజయ్‌, చతేశ్వర్‌ పుజారా, వృద్ధిమాన్‌ సాహాలకు తాజా కాంట్రాక్టు ప్రకారం రూ. 5కోట్లు అందుకోనున్నారు. గ్రేడ్‌ బి ఆటగాళ్లకు రూ.3 కోట్లు, గ్రేడ్‌-సి ఆటగాళ్లకు రూ.కోటి మేర ఇవ్వనున్నారు. గతంలో ఏ గ్రేడ్‌ ఆటగాళ్లకు రూ.2 కోట్లు, బీ గ్రేడ్‌ రూ.కోటి, సీ గ్రేడ్‌ ఆటగాళ్లకు రూ.50 లక్షల మేర కాంట్రాక్టు ప్యాకేజీ చెల్లించే విషయం తెలిసిందే.

తాజా కాంట్రాక్టులపై సీఓఏ వినోద్‌ రాయ్‌ స్పందించారు. ‘కార్పోరేట్‌ స్థాయిలో పంపకాలు జరిగే విధంగా కాంట్రాక్టులను తయారుచేశాం. ఇటీవల కోహ్లి, ధోని, రోహిత్‌ శర్మ, కోచ్‌ రవిశాస్త్రిలు కలిసి ఈ విషయంపై మాతో చర్చించారు. కేవలం ఏ గ్రేడ్‌ ఆటగాళ్లు ఎక్కువగా లబ్ధిపొందుతున్నారని, మరో ప్రత్యామ్నాయం ఆలోచించి.. కాంట్రాక్టులను పునరుద్ధరించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఏ+, ఏ అని మొత్తం 12 మంది నాణ్యమైన ఆటగాళ్లకు ఈ జాబితాల్లో చేర్చామని’ వినోద్‌ రాయ్‌ వివరించారు.

మరిన్ని వార్తలు