కోహ్లి.. వీటికి సమాధానం ఏది?

14 Mar, 2019 15:55 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన రెండు సిరీస్‌లనూ టీమిండియా కోల్పోవడంతో ఇంకా వరల్డ్‌కప్‌కు వెళ్లే జట్టు కూర్పుపై స్పష్టత రాలేదనే చెప్పాలి. అయితే ఆసీస్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన తర్వాత భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాత్రం అందుకు భిన్నంగా స్పందించాడు. ‘ఈ సిరీస్‌ ఓటమితో మేం ఏం కుంగిపోవడం లేదు. జట్టు కూర్పుకు సంబంధించి దాదాపుగా ఎలాంటి సమస్యలు లేవు.  మహా అయితే ఒక స్థానం గురించి మాత్రమే కాస్త ఆలోచించాల్సి ఉంది. పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హార్దిక్‌ పాండ్యా పునరాగమనంతో జట్టు బ్యాటింగ్‌ బలపడుతుంది. అలాగే బౌలింగ్‌ విభాగంకు కూడా మద్దతుగా ఉంటుంది’ అని పేర్కొన్నాడు.
(ఇక్కడ చదవండి: ఈ ఓటమి మంచిదే : కోహ్లి )

కాగా, ఇక్కడ కోహ్లి చెప్పిన దాంట్లో కేవలం ఒక్క ప్రశ్నకు మాత్రమే సమాధానం వచ్చినట్లు కనబడుతోంది. విజయ్‌ శంకర్‌ స్థానంలో హార్దిక్‌ పాండ్యా వరల్డ్‌కప్‌ ఎంపిక చేయడం అనేది దాదాపు ఖాయమైందనే విషయం కోహ్లి మాటల్లో వ్యక్తమైంది. అయితే ఈ సిరీస్‌ కేవలం విజయ్‌ శంకర్‌-హార్దిక్‌ పాండ్యాల మధ్య పోటీ కాదనే విషయం గ్రహించాలి. ఈ క్రమంలోనే ఈ సిరీస్‌ ద్వారా  చాలా ప‍్రశ్నలకు సమాధానం ఇంకా దొరకలేదు. వాటిలో ఒకటి నాల్గో నంబర్‌ కాగా, రెండోది మూడో ఓపెనర్‌ ఎవరనేది. అదే సమయంలో రెండో వికెట్‌ కీపర్‌గా ఎవర‍్ని తీసుకోవాలనే దానిపై కూడా క్లారిటీ లేదు. ఆపై నాలుగు పేసర్‌గా స్థానం ఎవర్ని తీసుకుంటారో అనేది ఇంకా ప్రశ్నార్థంగానే ఉండగా, రవీంద్ర జడేజా పూర్తిస్థాయిలో ఆకట్టకోలేకపోవడం కూడా టీమిండియా యాజమాన్యాన్ని సందిగ్థంలో పడేసింది.


నాలుగు ఎవరిది?
వరల్డ్‌కప్‌లో కోహ్లిని నాల్గో స్థానంలో బ్యాటింగ్‌ పంపుతామని కోచ్‌ రవిశాస్త్రి ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేశాడు. అయితే ఆసీస్‌తో సిరీస్‌లో విరాట్ కోహ్లి నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చింది కేవలం నాల్గో వన్డేలో మాత్రమే. అందులో కూడా కోహ్లి విఫలమయ్యాడు. ఇక్కడ కేఎల్ రాహుల్‌ మూడో స్థానంలో వస్తే, నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఇది మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ మాత‍్రమే ఆడిన చెప్పుకోదగ్గ ప‍్రదర్శన ఏమీ చేయలేదు. అదే సమయంలో అంబటి రాయుడ్ని నాల్గో స్థానంలో పరీక్షించినా అతను సైతం విఫలమయ్యాడు. గతంలో ఈ స్థానంలో ఆడిన మనీష్‌ పాండేను ఆసీస్‌తో సిరీస్‌లో పరీక్షించనే లేదు. దాంతో నాలుగో స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని విషయం ఇంకా డైలామాలోనే ఉంది.

మూడో ఓపెనర్‌ ఎవరు?
ప్రస్తుతం భారత వన్డే జట్టులో రెగ్యులర్‌ ఓపెనర్లుగా ఉన్నది శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మలు మాత్రమే. మరి ఆసీస్‌తో సిరీస్‌లో ఒక్క సెంచరీ మినహా అంతగా ఆకట్టుకోలేని ఇన్నింగ్స్‌లు ఆడిన ధావన్‌ సెలక్టర్లు పెద్ద పని పెట్టాడు. ఒకవేళ వరల్డ్‌కప్‌లో ధావన్‌ విఫలమైతే ఆ స్థానంలో ఎవర్ని పంపుతారనే దానిపై సమాధానం దొరకలేదు. మూడో ఓపెనర్‌గా రాహుల్‌ను పరిగణలోకి తీసుకుంటారా.. లేక అజింక్యా రహానేలాంటి సీనియర్‌ ఆటగాడికి వరల్డ్‌కప్‌లో చోటిస్తారా అనేది తేలాల్సి ఉంది.


రెండో వికెట్ కీపర్‌పై రాని స్పష్టత
ఆసీస్‌తో సిరీస్‌లో భారత యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ వైఫల్యం చెందాడు. అటు కీపింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ పంత్ నిరాశపరిచాడు. దాంతో రెండో వికెట్‌ కీపర్‌ ఎంపిక భారత జట్టుకు సవాల్‌గా మారింది. ఈ తరణుంలో భారత్‌కు ఉన్న రెండో ఆప్షన్‌ దినేశ్‌ కార్తీక్‌. ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు మాత‍్రమే పరిమితమైన దినేశ్‌ను వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదు. మరి ఇప్పుడు ఆ స్థానం పంత్‌దా.. లేక దినేశ్‌ కార్తీక్‌ అంటే నో క్లారిటీ. వరల్డ్‌కప్‌లో ఎంఎస్‌ ధోని రెగ్యులర్‌ కీపర్‌గా సేవలందించడంపై వందశాతం స్పష్టత రాగా, రెండో ఆప్షన్‌గా పంత్‌, దినేశ్‌ కార్తీక్‌ల్లో ఒక్కర్ని ఎంపిక చేయక తప్పదు. వీరిద్దరిలో పంత్‌ కంటే కార్తీక్‌ వైపే సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది.

మరొక పేసర్‌ ఎవరు?
వరల్డ్‌కప్‌కు ప్రకటించేబోయే జట్టులో పేస్‌ విభాగంలో బుమ్రా, షమీ, భువనేశ్వర్‌లు చోటు ఖాయమే. కాకపోతే ఇంగ్లండ్‌ పిచ్‌లపై స్పిన్నర్ల కంటే పేసర్ల ప‍్రభావమే ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో నాల్గో పేసర్‌గా ఎవర్ని ఎంపిక చేస్తారు అనే విషయంలో స్పష్టత లేదు. కేవలం ఆసీస్‌తో టీ20 సిరీస్‌కే పరిమితమైన ఉమేశ్‌ యాదవ్‌.. తొలి టీ20లో  భారత జట్టు ఓటమికి కారణమయ్యాడు. చివరి ఓవర్‌లో 14 పరుగులు సమర్పించుకోవడంతో భారత్‌ పరాజయం చవిచూసింది. ఈ టీ20 సిరీస్‌లో రెండో టీ20 ఆడిన సిద్దార్థ్‌ కౌల్‌ నాలుగు ఓవర్ల కోటా పూర్తిగా వేయకుండానే 45 పరుగులు ఇచ‍్చాడు. ఇక తొలి రెండు వన్డేలకు సిద్దార్థ్‌ జట్టులో ఉన‍్నప్పటికీ ఆడే అవకాశం రాలేదు. దాంతో నాల్గో పేసర్‌గా ఉమేశ్‌ యాదవ్‌ను తీసుకుంటారా లేక సిద్దార్థ్‌ కౌల్‌ను తీసుకుంటారా అంటే సమాధానం లేదు.


జడేజా పరిస్థితి ఏంటి?
ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో బౌలింగ్‌ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా ఆశించిన స్థాయిలో రాణించకలేకపోయాడు. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక బ్యాటింగ్‌లో పూర్తిస్థాయిలో విఫలమయ్యాడు. దాంతో జడేజా బెర్తుపై గ్యారంటీ లేకుండా పోయింది. ఆల్‌ రౌండర్‌ కోటాలో జడేజా పేరును పరిశీలిస్తే తప్ప అతని ఎంపిక అనేది ఈజీ కాకపోవచ్చు.  ఇక్కడ అదనపు స్పిన్నర్‌కే టీమిండియా యాజమాన్యం ప్రాధాన్యత ఇస్తే మాత్రం జడేజాకు చాన్స్‌ లేనట్లే. వీటితో ఇంకా పలు ప్రశ్నలు భారత సెలక్టర్ల మెదడుకు పనిపెట్టనున్నాయి. ఇంగ్లండ్‌కు పయనమయ్యే 15 సభ్యులు ఎవరు అనేది తేలాలంటే మాత్రం ఏప్రిల్‌ 20వ తేదీ వరకూ ఆగాల్సిందే.
(ఇక్కడ చదవండి:‘కోహ్లి నిర్ణయాలే కొంప ముంచాయి’)

>
మరిన్ని వార్తలు