ఆ విషయంలో ఇండియాదే పైచేయి.. కానీ!

15 Jul, 2019 11:32 IST|Sakshi

క్రికెట్‌కు పుట్టినిల్లుగా భావించే ఇంగ్లండ్‌ జట్టు సుదీర్ఘ కల నెరవేరింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఇంగ్లండ్‌ జట్టు తొలిసారి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. 44 ఏళ్ల వరల్డ్‌కప్‌ చరిత్రలో తొలిసారి టైటిల్‌ను సాధించింది. వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన కివీస్‌ జట్టుకు మరోసారి నిరాశే మిగిలింది. సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలై.. ఇంటిదారి పట్టిన భారత జట్టు కూడా ఫైనల్‌ ఫలితాల అనంతరం ఒకింత నిరాశ చెంది ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచకప్‌లో అతి తక్కువ పరాజయాలు చవిచూసిన జట్టు భారత్‌ మాత్రమే. ఇంగ్లండ్‌ తొలిసారి వరల్డ్‌ కప్‌ను కైవసం చేసుకున్నప్పటికీ.. ఆ జట్టు ప్రస్తుత టోర్నమెంటులో మూడు పరాజయాలు చవిచూసింది. లీగ్‌ దశలో ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఇండియా నాకౌట్‌ దశలో కివీస్‌ చేతిలో ఓడి.. ఫైనల్‌కు చేరకుండానే తన ప్రస్థానం ముగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రపంచకప్‌లో ఈ రెండు పరాజయాలు మినహా కోహ్లి సేన ఏడు విజయాలు సాధించింది. ఇక, విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్‌ జట్టు ఎనిమిది విజయాలు సాధించగా.. మూడు ఓటములు చవిచూసింది. ఆస్ట్రేలియా ఏడు విజయాలు, మూడు పరాజయాలు చవిచూడగా.. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌ ఆరు విజయాలు, నాలుగు పరాజయాలు తన ఖాతాలో వేసుకుంది.

పాకిస్థాన్ ఐదు విజయాలు, మూడు పరాజయాలు, శ్రీలంక మూడు విజయాలు, నాలుగు పరాజయాలు, దక్షిణాఫ్రికా మూడు విజయాలు, ఐదు పరాజయాలు, బంగ్లాదేశ్‌ మూడు విజయాలు, ఐదు పరాజయాలు నమోదుచేసుకోగా.. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న వెస్టిండీస్‌ రెండు విజయాలు మాత్రమే సాధించి.. ఆరు పరాజయాలు మూటగట్టుకుంది. ఇక, అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్‌ ఒక్క విజయాన్ని కూడా నమోదుచేయకుండా.. మొత్తం 9 పరాజయాలు మూటగట్టుకొని.. చిట్టచివరి స్థానంలో నిలిచింది.

మరిన్ని వార్తలు