ఇరగదీసిన టీమిండియా.. విండీస్‌కు భారీ లక్ష్యం

18 Dec, 2019 17:29 IST|Sakshi

విశాఖ: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా తన బ్యాటింగ్‌లో ఇరగదీసింది. ఆరంభం మొదలుకొని చివర వరకూ పవర్‌ హిట్టింగ్‌తో చెలరేగిపోయింది.ఫలితంగా వెస్టిండీస్‌కు 388 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. తొలి వన్డేలో 287 పరుగులు చేసిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో మరో వంద పరుగులు జోడించి 387 పరుగులు చేయడం విశేషం. రోహిత్‌ శర్మ(159; 138 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లు), కేఎల్‌ రాహుల్‌(102; 104 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు)ల సెంచరీలకు జతగా, శ్రేయస్‌ అయ‍్యర్‌(53;32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషభ్‌ పంత్‌(39; 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు)లు ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో  భారత్‌ భారీ స్కోరు చేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌ను ఎప్పటిలాగే రోహిత్‌-రాహుల్‌ ఆరంభించారు. ఆది నుంచి సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముందుగా రాహుల్‌ హాఫ్‌ సెంచరీ చేసుకోగా, అటు తర్వాత రోహిత్‌ అర్థ శతకం చేశాడు. 46 బంతుల్లో రాహుల్‌ అర్థ శతకం సాధించగా, రోహిత్‌  హాఫ్‌ సెంచరీ సాధించడానికి 67 బంతులు తీసుకున్నాడు. అటు  తర్వాత రోహిత్‌ రెచ్చిపోయి ఆడాడు.ఇక్కడ రోహిత్‌ హాఫ్‌ సెంచరీని సెంచరీగా మలచుకోవడానికి 40 బంతులు తీసుకోగా, రాహుల్‌ అర్థ శతకాన్ని శతకంగా మార్చుకోవడానికి మరో 56 బంతులు తీసుకున్నాడు. 

రోహిత్‌ 107 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ సాధించగా, రాహుల్‌ 102 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో శతకం నమోదు చేశాడు.102 వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్‌ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై కాసేపటికి కోహ్లి(0) గోల్డెన్‌  డక్‌గా ఔట్‌ కాగా, రోహిత్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ జత కలిశాడు. వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. అయితే జట్టు 292 పరుగుల వద్ద రోహిత్‌ మూడో వికెట్‌గా ఔటయ్యాడు. రోహిత్‌ శర్మ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పంత్‌ పూనకం వచ్చినట్లు రెచ్చిపోయి ఆడాడు. వచ్చీ రావడంతోనే బౌండరీలే లక్ష్యంగా బ్యాట్‌ ఝుళిపించాడు. గత కొంతకాలంగా తన పవర్‌ హిట్టింగ్‌పై విమర్శలు చేస్తున్న వారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.

పంత్‌ క్రీజ్‌లో ఉన్నంతసేపు టీమిండియా స్కోరు బోర్డు పరుగులు తీసింది. జోసెఫ్‌ వేసిన 45 ఓవర్‌లో రెండు సిక్సర్లు కొట్టిన పంత్‌.. కాట్రెల్‌ వేసిన 46వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లు కొట్టాడు. కీమో పాల్‌ వేసిన 48 ఓవర్‌ మూడో బంతికి మరో  భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. గాల్లోకి లేచిన బంతిని పూరన్‌ పట్టడంతో పంత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.  అటు తర్వాత ధాటిగా ఆడే క్రమంలో అయ్యర్‌ కూడా ఔటయ్యాడు. చివర్లో జాదవ్‌ 10 బంతుల్లో 3 ఫోర్లతో అజేయంగా 16 పరుగులు సాధించడంతో భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో కాట్రెల్‌కు రెండు వికెట్లు లభించగా, కీమో పాల్‌, జోసెఫ్‌, పొలార్డ్‌లకు తలో వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు