టీమిండియా ‘సూపర్‌ఫ్యాన్‌’ ఇకలేరు

16 Jan, 2020 11:59 IST|Sakshi

మీరు ఎప్పుడూ మా జట్టుతోనే ఉంటారు: బీసీసీఐ

లండన్‌: గతేడాది జరిగిన వరల్డ్‌కప్‌లో టీమిండియా ‘సూపర్‌ఫ్యాన్‌’ చారులతా పటేల్‌ చేసిన సందడి అంతా ఇంతా కాదు. భారత్‌ గెలిచిన ప్రతీ మ్యాచ్‌లోనూ ఆమె సందడి చేస్తూ ప్రేక్షకుల్లో సరికొత్త జోష్‌ను తీసుకొచ్చారు. 87 ఏళ్ల వయసులో చారులా పటేల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లకు చూడటానికి స్టేడియానికి వచ్చీ మరీ మ్యాచ్‌లను వీక్షించారు. అయితే ఇప్పుడు ఆమె ఇకలేరని వార్త క్రికెట్‌ అభిమానుల్లో విషాదం నింపింది. జనవరి 13వ తేదీ ఉదయం గం. 5.30.నిలకు ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. 

వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చారులతా పటేల్‌ ఒక సెలబ్రెటీగా మారిపోయారు. మ్యాచ్‌ జరుగుతున్నంతా సేపు అభిమానుల్ని ఉత్సాహ పరుస్తూ ఆమె సందడి చేశారు. ఆ మ్యాచ్‌ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలు ఆమెతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఆమె ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.ఎనిమిది పదుల వయసు దాటినా భారత క్రికెట్‌ అభిమానిగా ఆమె అందరిలో ప్రేరణ నింపడం అభినందనీయం. కాగా తాను భారత క్రికెట్‌ జట్టుకు దశాబ్ధాల నుంచి వీరాభిమానిగా కొనసాగుతున్నారు. 1983లో కపిల్‌ సేన ప్రపంచ కప్‌ను ముద్దాడిన సమయంలో తాను స్టేడియంలోనే ఉన్నానని విషయాన్ని చారులతా పటేల్ ఇది వరకే తెలపడం ఆమెకు క్రికెట్‌పై ఉన్న ప్రేమకు, ప్రధానంగా భారత జట్టుపై ఉన్న అభిమానానికి నిదర్శనం.

భారత సంతతికి చెందిన ఆమె.. పుట్టి పెరిగింది విదేశాల్లోనే. బ్రిటన్‌కు రాకముందు ఆమె దక్షిణాఫ్రికాలో ఉండేవారు. 1975 నుంచి ఆమె బ్రిటన్‌లో ఉన్నారు. చిన్నప్పట్నుంచి క్రికెట్‌కు వీరాభిమాని అయిన చారులతా పటేల్‌.. భారత్‌ ఆడే మ్యాచ్‌లను క్రమం తప్పకుండా టీవీల్లో వీక్షించేవారు. కాగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ‘ఈ విషయాన్ని శోకతప్త హృదయాలతో తెలియపరచాల్సి వస్తుంది. మా గ్రాండ్‌ మదర్‌ తుది శ్వాస విడిచారు. ఆమె చాలా మంచి మనిషే కాదు.. ఒక అసాధారణమైన వ్యక్తిత్వం కూడా ఆమె సొంతం. ఆమె మా ప్రపంచం’ అని చారులతా పటేల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో కుటుంబ సభ్యుల్లో ఒకరు పోస్ట్‌ చేశారు. చారులతా పటేల్‌ మృతిపై బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది. చారులతా ఎప్పుడూ భారత జట్టుతోనే ఉంటారని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని పేర్కొ‍ంది. 

మరిన్ని వార్తలు