గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధి

29 Dec, 2016 10:38 IST|Sakshi
గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధి

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రణాళిక   



హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో  ప్రతిభ గల క్రికెటర్లను గుర్తించి వారిని తగిన విధంగా ప్రోత్సహిస్తామని తెలంగాణ క్రికెట్ సంఘం (టీసీఏ) ప్రకటించింది. అందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు టీసీఏ వెల్లడించింది. టీసీఏ ఏర్పాటైన తర్వాత గత రెండున్నరేళ్ల కాలంలో తాము నిర్వహించిన వివిధ టోర్నీలు, కోచింగ్ క్యాంప్‌ల వివరాలను టీసీఏ వైస్ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. ‘అత్యంత ప్రజాదరణ ఉన్న క్రికెట్‌లో భారత్ తరఫున ఒక్క తెలంగాణ ఆటగాడు కూడా లేకపోవడం బాధగా ఉంది.

 

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతి, వివాదాలే అందుకు కారణం. హైదరాబాద్ మినహా గ్రామాలను వారు నిర్లక్ష్యం చేశారు. అందుకే ప్రతిభను వెలికి తీసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం’ అని విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సత్తా ఉన్నవారు పెద్ద స్థారుుకి ఎదిగే విధంగా తమ సంఘం సహకరిస్తుందని ఆయన చెప్పా రు. బీసీసీఐ గుర్తింపు కోసం తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, త్వరలోనే తమకు గుర్తింపు లభిస్తుందని టీసీఏ అధ్యక్షుడు యెండ్ల లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం అధ్యక్షుడు కలవల విశ్వేశ్వర్ రెడ్డి, టీసీఏ కార్యదర్శి గురవారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

 

>
మరిన్ని వార్తలు