‘విరాట్‌ కోహ్లితో పోలికే లేదు’

13 Jan, 2020 14:15 IST|Sakshi

న్యూఢిల్లీ: సమకాలీన క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ను పోల్చడం ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా టెస్టు ఫార్మాట్‌లో వీరిద్దరూ పరుగుల మోత మోగిస్తూ దూసుకుపోవడమే ఇందుకు కారణం. టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లి తొలిస్థానంలో ఉండగా, స్మిత్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లితో స్మిత్‌కు పోలికే లేదంటున్నాడు భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్‌. వైట్‌బాల్‌ క్రికెట్‌లో కోహ్లితో స్మిత్‌కు ఎక్కడా పోలికే లేదని తెగేసి చెప్పాడు. కాకపోతే భారత్‌తో సిరీస్‌లో స్మిత్‌ ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడో అనే దానిపైనే తనకు ఆసక్తి ఉందన్నాడు గంభీర్‌.

ఒకవేళ స్మిత్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే లబూషేన్‌ నాల్గో స్థానంలో వస్తాడని, అలా కాకుండా లబూషేన్‌ను ముందుకు ప్రమోట్‌ చేస్తే స్మిత్‌ నాల్గో స్థానంలో బ్యాటింగ్‌ వస్తాడన్నాడు. ఇక భారత ప్రధాన పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీలపై ప్రశంసలు కురిపించాడు గంభీర్‌. ఈ జోడి కచ్చితంగా ఆసీస్‌ బ్యాటింగ్‌ను ముప్పు తిప్పలు పెట్టడం ఖాయమన్నాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో వీరిద్దరూ ఎలా బౌలింగ్‌ చేస్తారో అని ఆతృతగా ఉందన్నాడు. ప్రధానంగా ఆసీస్‌ ప్రధాన ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌, అరోన్‌ ఫించ్‌లకు ఎలా కట్టడి చేస్తారో చూడాలని ఉందన్నాడు. రేపు(మంగళవారం) భారత్‌-ఆసీస్‌ జట్ల మధ్య ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. 

మరిన్ని వార్తలు