డబుల్‌ ధమాకా

23 Dec, 2016 00:43 IST|Sakshi
డబుల్‌ ధమాకా

ఈ యేటి మేటి క్రికెటర్‌గా అశ్విన్‌ ఎంపిక
టెస్టుల్లోనూ అత్యుత్తమ ప్లేయర్‌ పురస్కారం
వన్డే జట్టు సారథిగా విరాట్‌ కోహ్లి
ఐసీసీ వార్షిక అవార్డుల ప్రకటన


దుబాయ్‌: ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలోనూ అత్యద్భుత ప్రతిభ చూపిన భారత ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వార్షిక అవార్డుల్లో డబుల్‌ బొనాంజాతో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ప్రతిష్టాత్మక ‘క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గానే కాకుండా ‘ఉత్తమ టెస్టు క్రికెటర్‌’గానూ ఎంపికయ్యాడు. ఐసీసీ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచినందుకు అశ్విన్‌... సర్‌ గ్యారీ సోబర్స్‌ ట్రోఫీ అందుకోనున్నాడు. భారత్‌ నుంచి ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా అశ్విన్‌ నిలిచాడు. గతంలో రాహుల్‌ ద్రవిడ్‌(2004), సచిన్‌ టెండూల్కర్‌(2010) ఈ ట్రోఫీ అందుకున్నారు. మరోవైపు ద్రవిడ్‌(2004) అనంతరం ఒకే ఏడాది ఇలా రెండు ముఖ్య అవార్డులను గెల్చుకున్న రెండో భారత ఆటగాడిగానూ అశ్విన్‌ రికార్డులకెక్కాడు.

ప్రపంచ వ్యాప్తంగా గతంలో కలిస్‌(దక్షిణాఫ్రికా–2005), పాంటింగ్‌(ఆస్ట్రేలియా–2006), సంగక్కర (శ్రీలంక–2012), మైకేల్‌ క్లార్క్‌ (ఆస్ట్రేలియా–2013), మిచెల్‌ జాన్సన్‌(ఆస్ట్రేలియా–2014), స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా–2015) ఈ ఫీట్‌ సాధించారు. ఈ అవార్డుల ప్రకటన కోసం గతేడాది సెప్టెంబర్‌ 14 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌ 20వరకు ప్రదర్శనలను పరిగణలోకి తీసుకున్నా రు. ఈ అవార్డులపై ఓటింగ్‌ జరిగింది. ఈ కాలంలో 30 ఏళ్ల అశ్విన్‌ ఎనిమిది టెస్టులు ఆడి 48 వికెట్లు తీయడంతోపాటు 336 పరుగులు సాధించాడు. 19 టి20ల్లో 27 వికెట్లు తీశాడు. అంతేకాకుండా 2015, 2016 సీజన్‌లను టెస్టుల్లో నంబర్‌వన్‌ బౌలర్‌గా ముగించాడు. ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ రిచర్డ్‌సన్, బీసీసీఐ అధ్యక్షుడు ఠాకూర్‌ కూడా అశ్విన్‌కు శుభాకాంక్షలు తెలి పారు. ఐసీసీ టెస్టు జట్టులో భారత కెప్టెన్‌ కోహ్లికి స్థానం దక్కలేదు. ఈ సెప్టెంబరులో ఓటింగ్‌ ముగిసిన తర్వాత కోహ్లి 964 పరుగులు చేయడంతో అతని పేరును ఈ అవార్డు ఎంపికకు  పరిశీలించలేదు.

తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల విభాగం అవార్డుల్లో వన్డే, టి20ల్లో ఉత్తమ క్రికెటర్‌గా సుజీ బేట్స్‌ (న్యూజిలాండ్‌) ఎంపికైంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. ఆమె ఏడు వన్డేల్లో 472 పరుగులు చేసి, 8 వికెట్లు తీసింది.  

స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డు మిస్బాకు..
ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపి ఈ ఏడాది ఆరంభంలో జట్టును టెస్టుల్లో నాలుగో స్థానం నుంచి నంబర్‌వన్‌గా నిలిచేలా చేసిన పాకిస్తాన్‌ టెస్టు కెప్టెన్‌ మిస్బా వుల్‌ హక్‌ తమ దేశం నుంచి తొలిసారిగా ఈ అవార్డును దక్కించుకున్నాడు.

ఎరాస్మస్‌కు డేవిడ్‌ షెఫర్డ్‌ ట్రోఫీ
దక్షిణా ఫ్రికాకు చెందిన మారి యస్‌ ఎరాస్మస్‌ ఉత్తమ అంపైర్‌గా నిలిచి షెఫర్డ్‌ ట్రోఫీని అందుకోనున్నారు.

ఏడాది కాలంగా అత్యుత్తమంగా రాణిస్తున్న ఆటగాళ్లతో  కలిపి ఐసీసీ టెస్టు, వన్డే జట్లను ఎంపిక చేసింది. ఇందులో చోటు దక్కించుకున్న ఆటగాళ్ల వివరాలు...

ఐసీసీ టెస్టు జట్టు: కుక్‌ (కెప్టెన్‌ – ఇంగ్లండ్‌), వార్నర్, స్మిత్, వోజెస్, స్టార్క్‌ (ఆస్ట్రేలియా), విలియమ్సన్‌ (న్యూజిలాండ్‌), రూట్, బెయిర్‌స్టో, స్టోక్స్‌ (ఇంగ్లండ్‌), అశ్విన్‌ (భారత్‌), రంగన హెరాత్‌ (శ్రీలంక), స్టెయిన్‌ (దక్షిణాఫ్రికా).

ఐసీసీ వన్డే జట్టు: కోహ్లి (కెప్టెన్‌–భారత్‌), వార్నర్, స్టార్క్, మిషెల్‌ మార్‌‡్ష (ఆస్ట్రేలియా), డి కాక్, డివిలియర్స్, రబడ, ఇమ్రాన్‌ తాహిర్‌ (దక్షిణాఫ్రికా), రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా (భారత్‌), జోస్‌ బట్లర్‌ (ఇంగ్లండ్‌), సునీల్‌ నరైన్‌ (వెస్టిండీస్‌).

వన్డేల్లో ఉత్తమ ఆటగాడిగా డి కాక్‌
దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డి కాక్‌ ఓటింగ్‌ పీరియడ్‌లో ఆడిన 16 వన్డేల్లో 793 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలున్నాయి. వికెట్‌ కీపర్‌గా 15 మందిని అవుట్‌ చేశాడు.

టి20ల్లో ఉత్తమ ప్రదర్శన అవార్డు
ఈ ఏడాది జరిగిన టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై వెస్టిండీస్‌ క్రికెటర్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ చివరి ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించాడు. ఈ అవార్డు గెల్చుకున్న తొలి విండీస్‌ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.

ఐసీసీ ఎమర్జింగ్‌ క్రికెటర్‌గా ముస్తఫిజుర్‌
మూడు వన్డేల్లో ఎనిమిది వికెట్లు, 10 టి20ల్లో 19 వికెట్లు తీసిన బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తఫిజుర్‌... తమ దేశం నుంచి ఐసీసీ వార్షిక అవార్డును అందుకుంటున్న తొలి ఆటగాడిగా నిలిచాడు.

అసోసియేట్‌ జట్ల ఉత్తమ క్రికెటర్‌గా...
అఫ్ఘానిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ షహజాద్‌ ఆడిన 16 వన్డేల్లో 699 పరుగులు చేశాడు. 17 టి20 మ్యాచ్‌ల్లో 301 పరుగులు... ఇంటర్‌ కాంటినెంటల్‌ మ్యాచ్‌ల్లో 301 పరుగులు సాధించాడు. అఫ్ఘానిస్తాన్‌ నుంచి తొలిసారిగా ఈ ఘనత సాధించిన ఆటగాడయ్యాడు.

ఐసీసీ నుంచి ఈ గొప్ప గౌరవాన్ని పొందినందుకు సంతోషంగా ఉంది. సచిన్, ద్రవిడ్‌ అనంతరం ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా నిలవడం చాలా గొప్పగా ఉంది. ఈ సందర్భంగా చాలామందికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉంది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ దశకు చేరుకున్నాను. ముఖ్యంగా జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది ఎంతగానో ప్రోత్సహించారు. ఇక నా కుటుంబానికి ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. ధోని రిటైర్మెంట్‌ అనంతరం ఏర్పడిన సంధి కాలాన్ని యువ కెప్టెన్‌ కోహ్లి నేతృత్వంలో అద్భుతంగా అధిగమించాం.
– అశ్విన్‌
 

మరిన్ని వార్తలు