దిగ్గజాల సరసన సౌతీ

27 Aug, 2019 16:14 IST|Sakshi

కొలంబో: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో భాగంగా న్యూజిలాండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు పేసర్‌ టిమ్‌ సౌతీ..  250 టెస్టు వికెట్ల క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే. సోమవారం ముగిసిన రెండో టెస్టులో సౌతీ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆరు వికెట్లు సాధించాడు. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్‌లో లంక కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే వికెట్‌ను సాధించడం ద్వారా 250 వికెట్ల మార్కును చేరాడు. కాగా,  టెస్టు ఫార్మాట్‌లో  పదిహేను వందలకు పైగా పరుగులు, 250కి పైగా వికెట్లు, 45కి పైగా క్యాచ్‌లు పట్టిన ఎనిమిదో ఆటగాడిగా సౌతీ మరో ఘనత సాధించాడు.

ఈ క్లబ్‌లో ఇయాన్‌ బోథమ్‌(ఇంగ్లండ్‌), కపిల్‌  దేవ్‌(భారత్‌), షేన్‌ వార్న్‌(ఆస్ట్రేలియా), అనిల్‌ కుంబ్లే( భారత్‌), షాన్‌ పొలాక్‌(దక్షిణాఫ్రికా), జాక్వస్‌ కల్లిస్‌(దక్షిణాఫ్రికా), డానియెల్‌ వెటోరి(న్యూజిలాండ్‌)లు మాత్రమే ఇప్పటివరకూ ఉండగా వారి సరసన సౌతీ చేరిపోయాడు. టెస్టు క్రికెట్‌లో ఇప్పటివరకూ సౌతీ 1611 పరుగులు చేయగా, 251 వికెట్లను సాధించాడు. లంకేయులతో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 65 పరుగుల తేడాతో విజయం సాధించింది.   శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులకే చాపచుట్టేసి ఇన్నింగ్స్‌ పరాజయాన్ని మూటగట్టుకుంది. దాంతో రెండు టెస్టుల సిరీస్‌ 1-1తో సమం అయ్యింది.

మరిన్ని వార్తలు