జోరు కొనసాగిస్తారా!

15 Mar, 2016 00:09 IST|Sakshi
జోరు కొనసాగిస్తారా!

నేడు బంగ్లాదేశ్‌తో భారత్  తొలిపోరు
మహిళల టి20 ప్రపంచకప్

 
బెంగళూరు: పటిష్టమైన ఆస్ట్రేలియా, శ్రీలంకపై సిరీస్ విజయాలు సాధించిన భారత మహిళల జట్టు... కీలకమైన టి20 ప్రపంచకప్‌కు సిద్ధమైంది. నేడు (మంగళవారం) జరగనున్న తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గతంలో ఆడిన వరల్డ్‌కప్ టోర్నీల్లో రెండుసార్లు సెమీస్‌కు చేరిన భారత్... చివరి రెండుసార్లు మాత్రం గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. అయితే ఈసారి ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ టోర్నమెంట్‌లో మరోసారి సెమీస్‌కు చేరుకోవాలన్న లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. కెప్టెన్ మిథాలీ రాజ్‌తో పాటు ఏడుగురు క్రీడాకారిణిలకు 2014 టోర్నీలో ఆడిన అనుభవం ఉంది.

ఇక జులన్ గోస్వామి, హర్మన్‌ప్రీత్ కౌర్ గత నాలుగు టోర్నీల్లోనూ పాల్గొన్నారు. దీంతో సీనియర్ల అనుభవాన్ని ఉపయోగించుకుని ఈసారి ఎలాగైనా కప్ చేజిక్కించుకోవాలని జట్టు మేనేజ్‌మెంట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మిథాలీ, వనిత, కౌర్, మందన సూపర్ ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఓపెనర్లు విఫలమైతే మిడిలార్డర్ ఒత్తిడికి లోనుకావడం కాస్త ప్రతికూలాంశంగా మారింది. బౌలింగ్‌లో పేసర్ జులన్ గోస్వామి, స్పిన్నర్ ఏక్తా బిస్త్, అనుజా పాటిల్‌ల బంతులను ఎదుర్కోవడం ప్రత్యర్థికి పెద్ద సవాలే. వీళ్లు ముగ్గురు రాణిస్తే భారత్ విజయం నల్లేరు మీద నడకే.

మరోవైపు జహనరా నేతృత్వంలోని బంగ్లా జట్టు కూడా ఈ మధ్య కాలంలో బాగానే కుదురుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించే సత్తా లేకపోయినా సమష్టిగా ఆడుతోంది. బ్యాటింగ్‌లో కాస్త నిలకడను చూపెడితే ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడం ఖాయం. వార్మప్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలవడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. బౌలింగ్‌లో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. పోరాటం చేసైనా ఈ మ్యాచ్‌లో భారత్‌కు షాకిచ్చి టోర్నీలో ముందంజ వేయాలని బంగ్లాదేశ్ ప్రయత్నాలు చేస్తోంది.  
 
 మ.గం 3.30 నుంచి
 స్టార్ స్పోర్ట్స్-2లో
 ప్రత్యక్ష ప్రసారం

మరిన్ని వార్తలు