విరాట్‌-అనుష్కలపై సెటైర్లు

18 Jun, 2018 13:14 IST|Sakshi

ముంబై: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అనుష్క, విరాట్‌ కలిసి కారులో వెళుతుండగా పక్కనే కారులో వెళుతున్న అర్హాన్‌ సింగ్‌ అనే వ్యక్తి ప్లాస్టిక్‌ కవరును రోడ్డుపై పడేశాడు. అది గమనించిన అనుష్క కారు ఆపి మరీ అతని ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రోడ్డుపై ప్లాస్టిక్‌ ఎందుకు పారేస్తున్నారు? డస్ట్‌బిన్‌ ఉపయోగించండి’ అని కేకలు వేశారు.అనుష్క అతన్ని తిడుతున్నప్పుడు పక్కనే ఉన్న విరాట్‌ వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘వీళ్లా దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేది? ఎవరైనా చెత్త పడేయడం చూసినప్పుడు మీరూ ఇలానే వారిని ప్రశ్నించండి. అవగాహన కల్పించండి’ అని ట్వీట్‌ చేశారు. దీనిపై విరాట్‌-అనుష్క శర్మలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

‘మీరు సెలబ్రిటీ. మ్యాచ్‌ల్లో నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు. మీరు బూతులు మాట్లాడినప్పుడలా కెమెరాను స్లోమోషన్‌లో పెట్టొద్దు అని చెప్తారా? మిమ్మల్ని చూసి చాలా మంది అలా తిట్టడం ఫ్యాషన్‌ అనుకుంటున్నారు. అప్పుడు మీ విలువలు ఏమైపోయాయి?’ అని ఒకరు అడగ్గా, ‘అనుష్కకు రోడ్డుపై చెత్త పారేస్తున్నారన్న చింత కంటే.. దానిని వెంటనే వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలన్న ఆతృతే ఎక్కువగా ఉన్నట్టుంది. లేకపోతే అనుష్క అంతగా అరుస్తున్నప్పుడు విరాట్‌కు వీడియో తీయాలన్న ఆలోచన ఎలా వస్తుంది?’ అని మరో నెటిజన్‌ ప్రశ్నించాడు. ‘చెత్తపడేశాడని అనుష్క తిట్టడంలో తప్పులేదు. కానీ ఆ వ్యక్తి వివరాలు షేర్‌ చేయాల్సిన అవసరం ఏముంది?’ అంటూ మరో నెటిజన్‌ నిలదీశాడు. ‘ సచిన్‌ టెండూల్కర్‌ కూడా హెల్మెట్‌ పెట్టుకోమని బైక్‌పై వెళ్లే వాళ్లకు చెప్పిన సందర్భాలు ఉన‍్నాయి. కానీ సచిన్‌ ఎంతో హుందాగా చెబుతున్నాడు. అలా చెబితే ఒకసారి సదరు వ్యక్తి తప్పకుండా హెల్మెట్‌ పెట్టుకుంటాడు కూడా. మరి మీరు ఆగ్రహంతో కేకలు వేస్తే, ఫలితం ఉంటుందా? అని మరొకరు కామెంట్‌ చేశారు.

‘మీ భార్య హీరోయిజాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టాల్సిన అవసరం ఏముంది కోహ్లి? ఇలా రోడ్డుపై చెత్త వేసేవారిని తొలిసారి చూస్తున్నారా ? ఒకవేళ అతనికి బుద్ధిచెప్పాలనుకుంటే స్నేహపూర్వకంగా మాట్లాడాలి. అంతేకానీ బాస్‌లా ప్రవర్తించకూడదు’ అంటూ మరి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

మరొకవైపు అర్హాన్‌ సింగ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పారు. కానీ అనుష్క, విరాట్‌ తన పట్ల ప్రవర్తించిన తీరును విమర్శించారు. ‘నేను రోడ్డుపై పడేసిన చెత్త కంటే అనుష్క నోట్లో నుంచి వచ్చిన చెత్తే ఎక్కువగా ఉంది. సెలబ్రిటీ అయివుండి రోడ్డున పోయే వ్యక్తిలాగా కేకలు వేసింది. ఇది మీకు మర్యాద అనిపించుకోదు’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై అర్హాన్‌ తల్లి కూడా స్పందించారు. తన కుమారుడు చేసింది తప్పే కానీ అతన్ని పట్టుకుని రోడ్డుపై తిట్టడం సబబు కాదని అన్నారు.

కోపంతో రగిలిపోయిన అనుష్క శర్మ!

మరిన్ని వార్తలు