వేణుగోపాలరావు దూరం

22 Oct, 2017 02:38 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ప్రస్తుత రంజీ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లకు తాను అందుబాటులో ఉండటం లేదని ఆంధ్ర క్రికెట్‌ జట్టు సభ్యుడు వై. వేణుగోపాలరావు ప్రకటించాడు. వ్యక్తిగత కారణాలతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని భారత వన్డే జట్టు మాజీ సభ్యుడైన వేణు వివరించాడు.

ఈ సీజన్‌లో ఆంధ్ర జట్టు తమిళనాడు, బరోడా జట్లతో మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సంపాదించింది. వేణు మాత్రం తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో తుది జట్టులో ఆడి కేవలం మూడు పరుగులు చేసి అవుటయ్యాడు.

1998లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన 35 ఏళ్ల వేణు తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 121 మ్యాచ్‌లు ఆడి 7,081 పరుగులు చేయడంతోపాటు 66 వికెట్లు పడగొట్టాడు. ‘జట్టులో వేణుగోపాలరావు లేని లోటు కనిపిస్తుంది. అయితే అతని నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. వేణు స్థానంలో జ్యోతి సాయికృష్ణను జట్టులో ఎంపిక చేశాం’ అని ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ అరుణ్‌ కుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు