క్రీడల్లో ప్రతిభాన్వేషణ కోసం పోర్టల్‌ షురూ

29 Aug, 2017 01:03 IST|Sakshi
క్రీడల్లో ప్రతిభాన్వేషణ కోసం పోర్టల్‌ షురూ

న్యూఢిల్లీ: క్షేత్ర స్థాయి నుంచి క్రీడల్లో విశేష ప్రతిభ ఉన్న వారిని గుర్తించేందుకు కేంద్ర క్రీడా శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. దీంట్లో భాగంగా సోమవారం ‘జాతీయ క్రీడా ప్రతిభాన్వేషణ’ పోర్టల్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ‘ఇలాంటి చర్యలు ఉత్తమ నైపుణ్యం కలిగిన ఆటగాళ్లను గుర్తించడమే కాకుండా వారికి అత్యున్నత స్థాయిలో పోటీ పడే విధంగా తగిన వాతావరణాన్ని కల్పిస్తాయని’ ఆయన అన్నారు.

ఎనిమిదేళ్లకు పైబడి వయస్సు కలిగిన వారు ఏదైనా క్రీడల్లో నైపుణ్యం ఉంటే www.nationalsportstalenthunt.com పోర్టల్‌లో తమ బయోడేటా లేక వీడియోలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో నుంచి క్రీడా శాఖ తగినవారిని ఎంపిక చేసి తమ ‘సాయ్‌’ కేంద్రాల్లో శిక్షణ ఇస్తుంది. అలాగే ఎనిమిదేళ్లపాటు రూ.5 లక్షల చొప్పున వెయ్యి స్కాలర్‌షిప్‌లను అందిస్తామని క్రీడా మంత్రి విజయ్‌ గోయల్‌ తెలిపారు. ఇటీవలి కాలంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా రాణిస్తున్నారని, రియో ఒలింపిక్స్‌లో... ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో వారే పతకాలు తెచ్చారని గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు