సెమీఫైనల్లో హైదరాబాద్‌

16 Oct, 2018 00:20 IST|Sakshi

ఆంధ్రపై 14 పరుగులతో విజయం

రాణించిన సందీప్‌

మూడు కీలక వికెట్లు తీసిన సిరాజ్‌

విజయ్‌ హజారే ట్రోఫీ  

బెంగళూరు: విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా హైదరాబాద్‌తో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌... 282 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర స్కోరు 36.3 ఓవర్లు ముగిసేసరికి 198/2... అప్పటికే హనుమ విహారి (99 బంతుల్లో 95; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), రికీ భుయ్‌ (71 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్‌) నాలుగో వికెట్‌కు 112 పరుగులు జోడించి జోరు మీదుండటంతో ఆంధ్ర గెలుపు దిశగా సాగుతోంది. ఈ స్థితిలో హైదరాబాద్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ (3/50) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. తన వరుస ఓవర్లలో భుయ్, విహారిలను ఔట్‌ చేసి ఆంధ్ర ఆశలపై నీళ్లు చల్లాడు. చివరకు 14 పరుగుల తేడాతో గెలిచిన హైదరాబాద్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించగా, ఆంధ్ర నిష్క్రమించింది. ముందుగా హైదరాబాద్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది.

‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బావనక సందీప్‌ (97 బంతుల్లో 96; 7 ఫోర్లు, 1 సిక్స్‌) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, తన్మయ్‌ అగర్వాల్‌ (31; 2 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ అంబటి రాయుడు (28; ఫోర్, సిక్స్‌), సుమంత్‌ (27; 2 ఫోర్లు, సిక్స్‌), సీవీ మిలింద్‌ (7 బంతుల్లో 15; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. ఆంధ్ర బౌలర్లలో అయ్యప్ప, గిరినాథ్‌ రెడ్డి, పృథ్వీరాజ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆంధ్ర 50 ఓవర్లలో 9 వికెట్లకు 267 పరుగులే చేయగలిగింది. కెప్టెన్‌ హనుమ విహారి శతకం కోల్పోగా, అశ్విన్‌ హెబర్‌ (38) రాణించాడు. రేపు జరిగే తొలి సెమీఫైనల్లో ముంబైతో హైదరాబాద్, గురువారం జరిగే రెండో సెమీస్‌లో ఢిల్లీతో జార్ఖండ్‌ ఆడతాయి.  

మరిన్ని వార్తలు