కోహ్లి మాటను పరిగణనలోకి తీసుకోవాలి

15 Jan, 2015 00:44 IST|Sakshi
కోహ్లి మాటను పరిగణనలోకి తీసుకోవాలి

భారత్ కొత్త కోచ్ ఎంపికపై డీన్‌జోన్స్

మెల్‌బోర్న్: ప్రపంచ కప్ తర్వాత భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్‌ను ఎంపిక చేసే ప్రక్రియలో టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి కూడా పాత్ర ఉండాలని ఆసీస్ మాజీ ఆటగాడు డీన్‌జోన్స్ అభిప్రాయ పడ్డారు. వన్డే ప్రపంచ కప్‌తో డంకన్ ఫ్లెచర్ కాంట్రాక్ట్ ముగియనుంది. భవిష్యత్తులో కోహ్లి వన్డే, టి20 కెప్టెన్ కూడా అవుతాడనే విషయాన్ని మరువరాదని ఆయన అన్నారు. ‘భారత క్రికెట్ జట్టు అభివృద్ధికి ఎవరు ఉపయోగపడతారనే విషయంపై కోహ్లికి అవగాహన ఉంది.

రాబోయే రోజుల్లో ఎవరితో కలిసి తాను సౌకర్యవంతంగా పని చేయచేయగలడనేది కూడా ముఖ్యం. కాబట్టి కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియలో కోహ్లికి కూడా భాగం కల్పించాలి’ అని జోన్స్ చెప్పారు. బీసీసీఐ భారీ డబ్బు ఇచ్చి సహాయక సిబ్బందిని పెట్టుకోవడంతోనే ఫలితాలు రావని, పదే పదే వారిని మార్చడం కూడా జట్టుకు మంచిది కాదని ఈ ఆసీస్ మాజీ క్రికెటర్ అన్నారు. ప్రస్తుతం భారత్‌కు అత్యుత్తమ బౌలింగ్ కోచ్  అత్యవసరమని జోన్స్ వ్యాఖ్యానించారు.
 
ప్రపంచ కప్‌కు రూబెల్
ఢాకా: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని బెయిల్‌పై విడుదలైన బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హుస్సేన్‌కు ఊరట లభించింది. అతను విదేశీ ప్రయాణం చేసేందుకు ఢాకా కోర్టు అనుమతినిచ్చింది. ఫలితంగా రూబెల్ ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొననున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లా జట్టు ప్రత్యేక శిబిరానికి రూబెల్ హాజరు కాలేదు. అయితే కోర్టు సడలింపు ఇవ్వడంతో అతని వీసా కోసం బంగ్లా బోర్డు, ఆస్ట్రేలియా హై కమిషన్‌కు దరఖాస్తు ఇవ్వనుంది.

మరిన్ని వార్తలు