కోహ్లి సక్సెస్‌ అయ్యాడు..!

1 Dec, 2018 10:54 IST|Sakshi

సిడ్నీ: క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లి ఎట్టకేలకు సక్సెస్ అయ్యాడు. ఇక్కడ కోహ్లి విజయవంతమైంది బౌలింగ్‌లో. ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో మాత్రమే బౌలింగ్‌ వేసే కోహ్లి.. సీఎ ఎలెవన్‌తో మ్యాచ్‌లో కూడా బంతిని అందుకున్నాడు. మూడో రోజు ఆటలో రెండు ఓవర్లు పాటు బౌలింగ్‌ వేసి వికెట్‌ తీయలేని కోహ్లి.. శనివారం చివరి రోజు ఆటలో ఎట్టకేలకు వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. సౌత్‌ ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ హ్యారీ నీల్సన్‌ను ఔట్‌ చేశాడు. అది కూడా సెంచరీ సాధించి మంచి ఊపు మీద ఉన్న నీల్సన్‌ను  ఔట్‌ చేయడంతో కోహ్లి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు.

రెగ్యులర్‌ బౌలర్లు వికెట్లు సాధించడానికి అపసోపాలు పడిన పిచ్‌లో తనకు వికెట్‌ లభించడంపై కోహ్లి ఆనందంలో ఎగిరి గంతేశాడు.  ఈ మ్యాచ్‌లో ఏడు ఓవర్లు బౌలింగ్‌ వేసిన కోహ్లి వికెట్‌ సాధించి 27 పరుగులిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తంగా ఎనిమిది వికెట్లు కోహ్లి సాధించిన సంగతి తెలిసిందే. 2016లో వెస్టిండీస్‌ ఆటగాడు జాన్సన్‌ చార్లెస్‌ను కోహ్లి చివరిసారి ఔట్‌ చేశాడు.

కాగా, టీమిండియాతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 544 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ నీల్సన్‌(100) సెంచరీకి జతగా డీ ఆర్సీ షార్ట్‌ ( 74), మ్యాక్స్‌ బ్రయాంట్‌ ( 62), అరోన్‌ హార్డీ(86)లు రాణించడంతో సీఏ ఎలెవన్‌ భారీ స్కోరు సాధించింది.

మరిన్ని వార్తలు