‘కోహ్లి 100 సెంచరీలు కొడతాడు’

16 Jan, 2019 10:46 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వంద అంతర్జాతీయ శతకాలు సాధించగలడని మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ ఇదే ఫామ్‌ కొనసాగిస్తే అతడు వంద సెంచరీలు కొట్టడం ఖాయమన్నాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో కోహ్లి సెంచరీ చేశాడు. వన్డేల్లో అతడికిది 39వ సెంచరీ. టెస్టులు, వన్డేలు కలిపి ఇప్పటివరకు 64 సెంచరీలు సాధించాడు. అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్‌, పాంటింగ్‌ తర్వాత మూడో స్థానంలో కోహ్లి ఉన్నాడు. (కోహ్లి సెంచరీ.. ధోని ఫినిషింగ్‌ టచ్‌)

విరాట్‌ కోహ్లి నిలకడగా బాగా ఆడుతున్నాడు. ఫిట్‌గా ఉంటే 100 సెంచరీల మార్క్‌ను కచ్చితంగా చేరుకుంటాడు. కోహ్లి గొప్ప ఆటగాడు. అతడు సెంచరీ చేసినప్పుడు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే టీమిండియా ఓడిపోయింద’ని అజారుద్దీన్‌ పేర్కొన్నాడు. అర్ధ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనిపై కూడా అజర్‌ ప్రశంసలు కురిపించాడు. ధోని బాగా బ్యాటింగ్‌ చేశాడని, చివరివరకు వికెట్‌ కాపాడుకుని విన్నింగ్‌ షాట్‌ కొట్టడం అతడికే చెల్లిందని మెచ్చుకున్నాడు. దినేశ్‌ కూడా బాగా బ్యాటింగ్‌ చేశాడని, మొత్తంగా టీమిండియా ప్రదర్శన బాగుందని అభిప్రాయపడ్డాడు.

మరిన్ని వార్తలు