ఈ ‘డ్రా’లతో ఆనంద్‌కే మేలు

15 Nov, 2013 01:11 IST|Sakshi

చెస్ బోర్డులోని గడుల్లాగే నాలుగో గేమ్ 64 ఎత్తుల్లో డ్రాగా ముగిసింది. ఆనంద్ రెండో గేమ్ ఓపెనింగ్‌నే కొనసాగించినా... కార్ల్‌సెన్ వ్యూహం మార్చి బెర్లిన్ డిఫెన్స్‌ను ఉపయోగించాడు. ఈ ఓపెనింగ్‌తోనే క్రామ్నిక్ బాగా పాపులర్ అయ్యాడు. 2001లో కాస్పరోవ్‌ను ఇదే ఆయుధంతో ఓడించాడు కూడా. కార్ల్‌సెన్ సెకండ్స్‌లో నార్వే నుంచి జాన్ లూడ్‌విగ్ ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. బెర్లిన్ డిఫెన్స్‌లో తనకు చాలా వైవిధ్యాలు తెలుసు. దీనికి కార్ల్‌సెన్ బృందం బాగా సన్నద్ధమయింది. మరోవైపు ఆనంద్ ఆశ్చర్యకరంగా దీనికి సన్నద్ధం కాలేదు. నాలుగో గేమ్‌లో కార్ల్‌సెన్‌కు చాలా అవకాశాలు కనిపించినా... ఎక్కడా అతను గెలుస్తాడని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి.
 
 ప్రస్తుతం స్కోరు 2-2గా ఉంది. ఆరు గంటల పాటు సుదీర్ఘంగా ఆడిన తర్వాత ఒక రోజు విశ్రాంతి అవసరం. ఇప్పటివరకూ ఇద్దరూ ప్రత్యర్థి ఓపెనింగ్స్‌ను బాగా చదివారు. ఇక తర్వాతి గేమ్‌లలో కాస్త వేగం ఉంటుందని నా అభిప్రాయం. కార్ల్‌సెన్ రెటి ఓపెనింగ్‌కు కట్టుబడి 1, 3 గేమ్‌ల కంటే కాస్త మెరుగ్గా ఆడే అవకాశం ఉంది. ఇప్పటివరకూ నల్లపావులతో ఆడిన వాళ్లే గేమ్‌లో బాగా ఆడారు. నాలుగు గేమ్స్‌లో మూడుసార్లు నల్లపావులతో ఆడిన వాళ్లే ఆధిపత్యం చూపారు. తెల్లపావులతో ఆడటం వల్ల ఉండే లాభాన్ని ఇద్దరూ వినియోగించుకోలేదు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇది ఆశ్చర్యకరమే. తెల్లపావులతో ఓపెనింగ్ చేసేవాళ్లు సాధారణంగా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతారు. కానీ ఈసారి గేమ్‌లు అలా సాగడం లేదు.
 
 ఆనంద్ నల్లపావులతో జాగ్రత్తగా ఆడుతున్నాడు. ఐదోగేమ్‌లో కార్ల్‌సెన్ కాస్త దూకుడు పెంచి విజయం కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఇద్దరూ ఎవరూ ఎవరిపైనా ఆధిపత్యం చూపలేదు. డ్రా ల సంఖ్య పెరిగే కొద్దీ ఆనంద్‌కే పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కార్ల్‌సెన్‌పై ఒత్తిడి పెంచే అంశం. ఇలా వరుసగా డ్రాలు అయ్యే పరిస్థితిని గతంలో కార్ల్‌సెన్ ఎప్పుడూ ఎదుర్కోలేదు. కాబట్టి ఇది ఆనంద్‌కు మేలు చేసే అంశం. ఈ ఒక్క గేమ్ నల్లపావులతో ఆడితే... తర్వాత ఆనంద్ వరుసగా రెండు గేమ్‌లు తెల్లపావులతో ఆడొచ్చు. కాబట్టి మరో డ్రా జరిగినా ఆనంద్‌కు లాభమే.
 

మరిన్ని వార్తలు