నాడాకు వాడా షాక్‌!

23 Aug, 2019 11:27 IST|Sakshi

న్యూఢిల్లీ:  భారత జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ(నాడా)కు వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(వాడా) షాకిచ్చింది. జాతీయ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ(ఎన్‌డీటీఎల్‌) అధికారిక గుర్తింపుని ఆర్నెళ్ల పాటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్‌డీటీఎల్‌ ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే గుర్తింపు రద్దునకు కారణమని ఓ ప్రకటనలో వాడా తెలిపింది. ఈ మేరకు ఇటీవల చేపట్టిన తనిఖీల్లో వెల్లడైందన్నారు. వాడా ల్యాబొరేటరీ నిపుణుల బృందం మేలో తినిఖీలు ప్రారంభించిందని.. అనంతరం ఓ క్రమశిక్షణా కమిటీ కూడా దర్యాప్తు చేసిందన్నారు.

వాటి నివేదికల ఆధారంగానే.. వాడా ఎక్జిక్యూటివ్‌ కమిటీ నిర్ణయాలు తీసుకుందన్నారు. ఎన్‌డీటీఎల్‌పై నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని వాడా స్పష్టం చేసింది. దీంతో ఇప్పటి వరకు ల్యాబ్‌లో వివిధ దశల్లో ఉన్న నామూనాలను గుర్తింపు పొందిన ఇతర ల్యాబ్‌లకు పంపాల్సి ఉంటుంది. అయితే నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(నాడా) మాత్రం డోప్‌ పరీక్షలు నిర్వహించుకునేందుకు ఎలాంటి ఆటంకమూ ఉండదని సమాచారం. కానీ, సేకరించిన నమూనాలకు ఇతర దేశాల్లోని గుర్తింపు పొందిన ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.  అయితే టోక్యో ఒలిపింక్స్‌కు ఏడాది కూడా గడువు లేని సమయంలో వాడా ఇలా కొరడా ఝుళిపించడంతో నాడాకు పెద్ద ఎదురుదెబ్బే.

మరిన్ని వార్తలు