ఐపీఎల్‌లో బ్యాన్‌ చేశారు కదా.. ఇంకా ఏంటి?

29 Jun, 2020 17:13 IST|Sakshi
ప్రవీణ్‌ తాంబే(ఫైల్‌ఫోటో)

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) నుంచి తనను బ్యాన్‌ చేయడంపై వెటరన్‌ లెగ్‌ స్పిన్నర్‌ ప్రవీణ్‌ తాంబే వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తనను ఐపీఎల్‌ నుంచి బ్యాన్‌ చేసినప్పుడు ఇక మిగతా విదేశీ లీగ్‌లు ఆడకుండా అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వమంటూ బీసీసీఐపై మండిపడ్డాడు. ప్రస్తుతం తాను ఫిట్‌గా ఉ‍న్న క్రమంలో ఆడటానికి ఎటువంటి ఇబ్బందేమీ లేదన్నాడు. ఇక్కడ తన వయసు ప్రధానం కాదని తాంబే స్పష్టం చేశాడు. ‘నన్ను ఐపీఎల్‌ నుంచి నిషేధించారు. మరి ఇంకా ఏమిటి. ఐపీఎల్‌ నుంచి బ్యాన్‌ చేసినప్పుడు విదేశీ లీగ్‌లు ఆడటానికి అర్హత ఉంది కదా. ఆ క్రమంలోనే కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో టీకేఆర్‌ తరఫున ఆడుతున్నాను. బీసీసీఐ ఎలాగూ అది నిర్వహించే టోర్నీల్లో ఆడనివ్వడం లేదు. అటువంటప్పుడు విదేశీ టోర్నీలు ఎందుకు ఆడకూడదు’ అని ఒక జాతీయ పత్రికతో మాట్లాడుతూ తనకు ఎదురైన ప్రశ్నకు సమాధానంలో ఐపీఎల్‌ నుంచి బ్యాన్‌ కావడాన్ని ప్రస్తావించాడు. ‘ప్రవీణ్‌ తాంబే దేశవాళీ మ్యాచ్‌ల్లో ఒక యాక్టివ్‌ ప్లేయర్‌. అటువంటప్పుడు విదేశీ లీగ్‌లు ఆడకూడదు’ అని ఒక బీసీసీఐ అధికారి కౌంటర్‌కు సమాధానంగా తాంబే పై విధంగా స్పందించాడు. (కరోనాతో మాజీ క్రికెటర్‌ మృతి)

48 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ బరిలోకి దిగాలని భావించిన అతనికి కొన్ని నెలల క్రితం బీసీసీఐ బ్రేక్‌ వేసింది. నిబంధనల ప్రకారం తాంబే ఐపీఎల్‌ ఆడేందును అనర్హుడని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది యూఏఈలో జరిగిన టి10 లీగ్‌లో సింధీస్‌ జట్టు తరఫున తాంబే నాలుగు మ్యాచ్‌లు ఆడటం అతనిపై బ్యాన్‌కు కారణమైంది. బీసీసీఐ నిర్వహించే టోర్నీలో ఆడాలనుకునే వారు విదేశీ లీగ్‌ల్లో ఆడకూడదనే నిబంధన ఉన్నా దానిని తాంబే అతిక్రమించాడు. దాంతో నిషేధానికి గురయ్యాడు. కాగా, ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోయిన పెద్ద వయస్కుడిగా తాంబే నిలిచిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ 2020 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ. 20 లక్షల కనీస ధరకు అతడిని దక్కించుకుంది. 2013-16 మధ్య కాలంలో 33 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన తాంబే 28 వికెట్లు పడగొట్టాడు. 2014లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరపున బరిలోకి దిగి 15 వికెట్లు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. గుజరాత్‌ లయన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ తరపున కూడా ఆడాడు. (పిన్న వయసులోనే ఎలైట్‌ ప్యానల్‌లో చోటు)

మరిన్ని వార్తలు