రిజ్వీ గురికి రజతం

25 Apr, 2018 01:34 IST|Sakshi

 ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌

చాంగ్‌వన్‌ (కొరియా): అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచ కప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో వరుసగా తొలి రెండు రోజులు విఫలమైన భారత షూటర్లు మూడో రోజు బోణీ చేశారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో షాజర్‌ రిజ్వీ రజత పతకం నెగ్గడంతో భారత్‌ పతకాల ఖాతా తెరిచింది. 87 మంది పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో రిజ్వీ 582 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. భారత్‌కే చెందిన జీతూ రాయ్‌ 38వ, ఓంప్రకాశ్‌ 11వ స్థానాల్లో నిలిచారు.

టాప్‌–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత పొందుతారు. గత నెలలో మెక్సికోలో జరిగిన తొలి ప్రపంచకప్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్న రిజ్వీ ఈసారి 0.2  పాయింట్ల తేడాతో పసిడి పతకాన్ని చేజార్చుకున్నాడు. ఫైనల్లో రిజ్వీ 239.8 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆర్తెమ్‌ చెర్‌నుసోవ్‌ (రష్యా–240 పాయింట్లు) స్వర్ణం, సముయిల్‌ డాన్‌కోవ్‌ (బల్గేరియా–217.1 పాయింట్లు) కాంస్యం గెలిచారు.   పురుషుల ట్రాప్‌ ఈవెంట్‌లో భారత షూటర్లెవరూ ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. మానవ్‌జిత్‌ (117 పాయింట్లు), కైనన్‌ షెనాయ్‌ (115 పాయింట్లు), జొరావర్‌ సింగ్‌ (114 పాయింట్లు) వరుసగా 24, 36, 41వ స్థానాల్లో నిలిచారు.    

మరిన్ని వార్తలు