సాహా విధ్వంసం.. 20 బంతుల్లో శతకం! 

24 Mar, 2018 18:36 IST|Sakshi
వృద్దిమాన్‌ సాహా

14 సిక్సులు.. 4 ఫోర్లతో వీరవిహారం

సన్‌రైజర్స్‌ తరఫున బరిలోకి దిగనున్న సాహా

కోల్‌కతా : టీమిండియా టెస్ట్‌ వికెట్‌ కీపర్‌ వృద్దిమాన్‌ సాహా రెచ్చిపోయాడు. ఐపీఎల్‌ ఎఫెక్ట్‌ ఎమో కానీ మైదానంలో చెలరేగాడు. ఏకంగా 14 సిక్సులు, నాలుగు ఫోర్లతో కేవలం 20 బంతుల్లో శతకం బాదాడు. శనివారం కోల్‌కతాలో జరిగిన జేసీ ముఖర్జీ లోకల్‌ టీ20 టోర్నీలో సాహా 20 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఎదుర్కొన్న 20 బంతుల్లో 18 బంతులను బౌండరీ లైన్‌ దాటించడం విశేషం. వీటితోనే సాహా 100 పరుగులను పూర్తి చేశాడు. మరో రెండు బంతుల్లో రెండు సింగిల్స్‌ సాధించాడు.

ఈ విజృంభణతో సాహా ప్రాతినిధ్యం వహిస్తున్న మోహన్‌ బగాన్‌ జట్టు బీఎన్‌ఆర్‌ రీక్రియేషన్‌ క్లబ్‌పై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బీఎన్‌ఆర్‌ 152 లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన మోహన్‌ బగాన్‌ సాహా, కెప్టెన్‌ సుబ్‌హోమయ్‌(43 22 బంతుల్లో)లు దాటిగా ఆడటంతో వికెట్‌ నష్ట పోకుండా కేవలం 7 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ మ్యాచ్‌ అనంతరం సాహా మాట్లాడుతూ.. ‘ఇది రికార్డో కాదో కూడా నాకు తెలియదు. ఐపీఎల్‌ను దృష్టిలో ఉంచుకోని ప్రత్యేకమైన్‌ షాట్స్‌ ఆడటానికి ప్రయత్నించా. ప్రతి బంతి నా బ్యాట్‌ మధ్యలో తగిలిందని భావించి హిట్టింగ్‌ చేశానని’ తెలిపాడు. ఇక వన్డే, టీ20ల్లో అవకాశంపై స్పందిస్తూ.. అది సెలక్టర్ల నిర్ణయమని, అవకాశం వచ్చేలా ఆడటమే నా బాధ్యత అని చెప్పుకొచ్చాడు.

ఈ సీజన్‌ ఐపీఎల్‌లో సాహా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున బరిలోకి దిగుతు‍న్న విషయం తెలిసిందే. అయితే ఓపెనింగ్‌ బ్యాటింగ్‌ చేయడానికే ఇష్టపడుతానన్నా సాహా సన్‌రైజర్స్‌లో ధావన్‌, వార్నర్‌లు ఉండటంతో ఏ స్థానంలో ఆడటానికైనా సిద్దమేనన్నాడు.

ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్‌లో అతి తక్కువ బంతుల్లో శతకం సాధించిన రికార్డు విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌గేల్‌ పేరిట ఉన్న విషయం తెలిసిందే. 2013 ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన గేల్‌.. పుణె వారియర్స్‌పై 30 బంతుల్లో శతకం సాధించి రికార్డు సృష్టించాడు.

మరిన్ని వార్తలు